నీటి కష్టాలు ఉండొద్దనే మిషన్ భగీరథ : ప్రశాంత్‌రెడ్డి

Fri,April 21, 2017 04:14 PM

Mission Bhagiratha avoids water problems says Prashanth reddy

హైదరాబాద్ : నీటి కష్టాలు ఉండొద్దనే ఉద్దేశంతోనే మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో తాగునీటి వ్యధ తీర్చే మిషన్ భగీరథపై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచు గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిపోయే పరిస్థితి, గ్రామాల్లో నీటి కోసం నల్లాల వద్ద కొట్లాడే పరిస్థితి, గిరిజనులు, ఆదివాసీలు మురికి నీరు తాగి అస్వస్థతకు గురయ్యే పరిస్థితి, నల్లగొండ ప్రజలను పట్టిపీడిస్తున్న ఫోరైడ్ సమస్య.. తాగునీటి కోసం ఇన్ని సమస్యలున్నప్పటికీ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మొత్తం జనాభాలో 70 శాతం మందికి మంచినీరు దొరక్కపోవడం వలనే రోగాలు వస్తున్నాయి అని తెలిపారు. కిడ్నీ సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
TRS PLENARY 2017 Photo Gallery
మంచినీటి కష్టాలు అనేకం. నీటికష్టాలతో 83 శాతం మంది మహిళలు బాధపడుతున్నారు. మహిళలకు నీళ్లు మోసి మోసి వెన్నునొప్పులు వస్తున్నాయని చెప్పారు. ఇన్ని బాధలు ఉన్నప్పటికీ.. ఏ నాయకుడు కూడా మహిళలపై కనికరించలేదు. సిద్ధిపేట ఆడపడుచుల కష్టాలు చూసిన నాయకుడు కేసీఆర్.. నదీజలాలను సిద్ధిపేటకు తీసుకువచ్చి వారి దాహార్తిని తీర్చారు. సిద్ధిపేటలో నీటికి ఇబ్బందుల్లేవని గుర్తు చేశారు. ఒక ఎమ్మెల్యేగా 20 సంవత్సరాల క్రితం సిద్ధిపేట ప్రజల నీటి కష్టాలు తీర్చారు కేసీఆర్. అదే స్ఫూర్తితో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఆడపడుచులకు నీటి కష్టాలు ఉండొద్దనే లక్ష్యంతోనే మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. నదీజలాలను మిషన్ భగీరథ పథకం ద్వారా తీసుకువచ్చి ప్రజలకు తాగునీటి కష్టాలను తీర్చేందుకు సంకల్పించారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు త్వరలోనే ఇస్తున్నామని చెప్పారు. అనుక్నున సమయం కంటే ముందే ఇంటింటికీ మంచినీరు అందిచేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తాగునీటి వ్యధ తీర్చే మిషన్ భగీరథ తీర్మానాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బలపరిచారు.

1050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS