రైతుమిత్ర యాప్‌ను ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి

Sun,November 17, 2019 06:32 PM

సిద్దిపేట: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేటలో మంత్రులు తన్నీరు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతుమిత్ర యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా సిద్దిపేటలో రైతులకు కీలక సమాచారం కోసం రైతుమిత్ర యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా 18 రకాల సలహాలు పొందవచ్చని మంత్రి తెలిపారు. సాంకేతిక సాగు సలహాలను సమయానుకూలంగా అందించడం, ప్రభుత్వ పథకాలు, రాయితీలు, సూచనలను వ్యవసాయ అధికారులు తెలియజేస్తారని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మంత్రి హరీష్ ఈ సందర్భంగా రైతులనుద్ధేశించి తెలిపారు. ఏఈవోలు కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆయన సూచించారు. అధిక ఆదాయం వచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రతి గ్రామ సభకు ఏఈవోలు హాజరవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.


వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట కేంద్ర బిందువని అన్నారు. 30 రోజుల గ్రామ ప్రణాళికతో గ్రామాల రూపురేఖలు మారాయని మంత్రి తెలిపారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రైతు సమన్వయ సమితి ద్వారా అనేక సమస్యలు పరిష్కరించుకుందామని మంత్రి రైతులను ఉద్దేశించి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్‌పై ముఖ్యమంత్రి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులు.. ఆరుతడి, కూరగాయల పంటలు ఎక్కువగా పండించాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 220 మండలాల్లో ఆయిల్ సాగుకు భూములు అనుకూలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు.. వ్యవసాయాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

1403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles