గిరిజన సంక్షేమ శాఖపై మంత్రి సత్యవతి సమీక్ష

Thu,September 19, 2019 10:29 PM

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని ఈ ప్రభుత్వంపై ముఖ్యంగా గిరిజనులు, మహిళలు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. వారి ఆశలు తీరేలా, వారు సంతృప్తి చెందేలా అందరం కలిసి పనిచేద్దాం.. ఇప్పటి వరకు చేరుకోలేని గిరిజన తండాలు, ఆదివాసి గూడాలకు చేరుకుని ప్రభుత్వ పథకాలను అందిద్దామని గిరిజన, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గిరిజన శాఖ అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు.


దేశంలో, రాష్ట్రంలో ఆర్ధిక మాంద్యం ఉన్న ముఖ్యమంత్రి కేసిఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. విద్యతోనే వికాసం ఉంటుంది కాబట్టి, సీఎం కేసిఆర్ నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందరికీ అందేలా నిధులిస్తున్నారని తెలిపారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో, ఐటిడిఏలలోని పాఠశాలలో విద్యార్థులు తగ్గకుండా చూసుకోవాలని, అందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని మంత్రి చెప్పారు.

ఇప్పటికే గిరిజన శాఖలో ముఖ్యమంత్రి కేసిఆర్ తీసుకొచ్చిన అనేక పథకాలు ప్రజలకు చేరేలా అధికారులు పనిచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చేరుకోని గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలకు కూడా చేరుకుని మరింత సమర్ధవంతంగా ఈ పథకాలను అందించేలా పనిచేద్దామని చెప్పారు. గిరిజన శాఖలో కేంద్రం నుంచి వచ్చే నిధులు చాలా ఉన్నాయని, వాటిని ఎక్కువగా రాష్ట్రానికి తెచ్చుకునేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసిఆర్ అనుమతితో రాష్ట్రంలోని గిరిజన నేతలు, సంఘాలు, అధికారులతో కలిసి కేంద్రం వద్దకు ఒక బృందంగా వెళ్దామని చెప్పారు.

వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 5,6,7,8 తేదీల్లో సమ్మక్క-సారక్క జాతర జరుగుతుందని, ఇందుకోసం జాతర ఏర్పాట్ల నిమిత్తం అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు. సమ్మక్క-సారక్క జాతరను జాతీయ పండగగా గుర్తించేందుకు కూడా కేంద్రం మీద ముఖ్యమంత్రి కేసిఆర్ సూచనలతో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా త్వరలోనే అన్ని జిల్లాలు, ఐటీడీలలో పర్యటిస్తానని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిశీలించి సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కారం చూపేందుకు పనిచేస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్త ఎక్కా, కమిషనర్ క్రిస్టినా చోంగ్తు, ఐటీడీఏల ప్రాజెక్టు ఆఫీసర్లు, చీఫ్ ఇంజనీర్ శంకర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

493
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles