రేవంత్‌ రెడ్డి టీవీల్లో పోజులు కొట్టడం తప్ప.. చేసిందేమీ లేదు: కేటీఆర్

Wed,November 21, 2018 09:15 PM

minister ktr participated in meeting in kodangal

వికారాబాద్: రేవంత్‌రెడ్డి టీవీల్లో పోజులు కొట్టడం తప్ప.. చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలోని కొడంగల్‌లో ఇవాళ సాయంత్రం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు."ఇది ఎన్నికల ప్రచారం సభలా లేదు. విజయయాత్రలా ఉంది. మీ స్పందన చూస్తుంటే పట్నం నరేందర్‌రెడ్డి గెలుపు ఖాయమైంది. కొడంగల్ ప్రజల పట్టుదలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇంత గొప్ప స్థాయిలో సభ జరగడం సంతోషంగా ఉంది. కొడంగల్ నియోజకవర్గంలో బంగారం లాంటి భూములు ఉన్నాయి. కృష్ణానది నీళ్లు కొడంగల్ భూముల్లో పారాలి. పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపించండి.. కృష్ణా నీళ్లతో మీ పాదాలు కడుగుతా. కొడంగల్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయండి. మీ నియోజకవర్గాన్ని నేనే దత్తత తీసుకుంటా. . ఏ కులమైనా ఏ మతమైనా అందరినీ ఒకేలా చూసుకున్నాం.

పట్నం నరేందర్‌రెడ్డిని కారులో అసెంబ్లీకి పంపించండి. మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. కేసీఆర్ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే.. హాస్టళ్లకు సన్నబియ్యం అందిస్తున్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మీ పథకం కింద రూ.లక్షా 116 ఇస్తున్నాం. పెన్షన్ వయోపరిమితి 58 ఏండ్లకు తగ్గిస్తాం. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి. కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటుంది. పాలమూరు ఎత్తిపోతలను ఆపాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాసిండు. పాలమూరు ఎత్తిపోతల పథకం మీద చంద్రబాబు కత్తిగట్టిండు. నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్ సిగ్గు లేకుండా పొత్తు పెట్టుకుంది. కొడంగల్‌లో నరేందర్‌రెడ్డిని గెలిపిస్తే లక్ష ఎకరాలకు కృష్ణా నీరు తెస్తం. కూటమికి ఓటేస్తే మన వేలితో మన కన్నే పొడుచుకున్నట్టు అయితది. నామినేషన్లు అయిపోయినా కూటమి నాయకులు సీట్లు పంచుకున్నరు. కూటమి సీట్లు పంచుకునే లోపు మేం గెలిచి స్వీట్లు కూడా పంచుకుంటాం. కూటమికి ఓడిపోయే సీట్లు పంచుకునేందుకు నెల రోజులు పట్టింది. అభివృద్ధి ఆగొద్దంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గట్టు మీద కరెంటు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్, టీడీపీ ఉంది.. ఈ గట్టు మీద 24 గంటల కరెంటు ఇచ్చిన టీఆర్‌ఎస్ ఉంది. ఆ గట్టు మీద మాటల నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నడు.. ఈ గట్టు మీద చేతల నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి ఉన్నడు.." అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

4019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS