గురుకులాలల్లో మెరుగైన విద్య... మంత్రి కొప్పుల

Mon,June 17, 2019 08:56 PM

minister koppula eshwar inaugurated BC gurukulam school

జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గురుకులాల్లో మెరుగైన విద్యను అందించడానికే ఏర్పాటు చేశారని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గానికి కేటాయించిన గురుకులాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థికి రూ.1.25లక్షల ప్రభుత్వం ఖర్చు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. కార్పొరేట్‌లో అందే విద్యను ఈ గురుకులాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 119 బీసీ గురుకులాలను ఏర్పాటు చేయడం దేశంలో మరెక్కడా లేదన్నారు. గురుకులాల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయని, గత రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఇంటర్‌లో మంచి మార్కులు సాధించడంతో పాటు, దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో కూడా మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. గురుకులాల్లో పేద, మద్య తరగతి విద్యార్థులకు మౌళిక వసతులతో పాటు, ఆంగ్లమాద్యమంలో విద్యను అందించడానికి ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన గురుకులాల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించి, అందులో మంచి మార్కులు సాధించిన వారికే ఇందులో సీట్లు లభించాయన్నారు.

సీట్లు సాధించిన విద్యార్థులు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలతో శ్రద్దగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన 3 గురుకులాల్లో 420 మంది విద్యార్థులకు మంచి విద్యను పొందే వీలుందన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం మంచి లక్ష్యంతో గురుకులాలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నదనీ, దీన్ని విద్యార్థులు ఉపయోగించు కోవాలన్నారు. జిల్లాలో గతంలో 3, ప్రస్తుతం 3 గురుకులాలు ఏర్పాటు చేసిందనీ, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని గురుకులాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవన్నారు.

కేసీఆర్ ముందు చూపుతో విద్యావ్యవస్థను అందులో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రణాళికలే గురుకులాల ఏర్పాటన్నారు. గురుకులాల ఏర్పాటుతో జిల్లాలో మెరుగైన విద్యను పేద, మద్యతరగతి విద్యార్థులకు అందుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత-సురేశ్, ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్ రావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్, జేసీ బేతి రాజేశం, ఆర్డీఓ ఘంటా నరేందర్, జిల్లా విద్యాధికారి ఎస్ వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నాయకులు గట్టు సతీష్, దావ సురేశ్, బోగ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

1743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles