రిజర్వేషన్ల వల్లే నేను, ఎమ్మెల్యే రాజయ్య ఇక్కడున్నాం: కడియం

Sat,August 25, 2018 06:22 PM

minister kadiyam srihari unveiled ambedkar statue in jangaon district

- అంబేద్కర్ లేకుంటే మేం ఇక్కడ లేం.. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిక్ష
- అంబేద్కర్ ఆశయాల మేరకే సీఎం కేసీఆర్ పాలన సాగుతోంది
- సీఎం కేసీఆర్ విద్యకు పెద్దపీట వేస్తున్నారు
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చింది
- పేదలకు నాణ్యమైన విద్య అందించాలని దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు ఏర్పాటు
- దేశంలో ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి
- రాజవరపు స్కూల్ కు ఇచ్చిన అదనపు గదులు త్వరగా నిర్మాణమయ్యేలా చూస్తాను
- ఎస్సీ, యాదవ కమ్యునిటీ హాళ్లకు పది లక్షల రూపాయలు మంజూరు
-  అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
 
జనగామ: బాబా సాహెబ్ భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల మేరకే నేడు సీఎం కేసీఆర్ తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, విద్యకు పెద్ద పీట వేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. జిల్లాలోని చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, యాదవ కమ్యూనిటీ హాళ్లకు కావల్సిన నిధులను మంజూరు చేస్తానని చెప్పారు. రాజవరపు గ్రామానికి మంజూరు చేసిన అదనపు తరగతి గదులు నిర్మాణం వేగవంతం అయ్యేలా చేస్తానన్నారు. అదేవిధంగా కర్నాల కుంటకు దేవాదుల ద్వారా నీటిని తెచ్చే ప్రయత్నం చేస్తానన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 సంవత్సరాల కిందటే రాష్ట్రాల పునర్విభజన గురించి ఆలోచన చేసి ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపర్చిన గొప్ప వ్యక్తి అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కేసిఆర్ నాయకత్వంలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఆర్టికల్ 3వల్లే వచ్చిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆశయాలను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లు విద్యకు సీఎం పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. అదేవిధంగా పేద, బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో 517 గురుకుల పాఠశాలలు, 53 గురుకుల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. వీటితో పాటు కొత్తగా 84 కేజీబీవీలు వచ్చాయన్నారు. ఇటీవలే 88 కేజీబీవీలను కాలేజీలుగా, 33 తెలంగాణ గురుకుల విద్యాలయాలను కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామని వివరించారు. నేడు తెలంగాణలో 800కి పైగా ఉన్న గురుకులాల్లో 8 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు.

దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా సీఎం తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ రాకముందు కరెంటు కోసం నానా కష్టాలు పడ్డామని, తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని, ఇదొక అద్భుతమని అభివర్ణించారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏటా 8000 రూపాయలిస్తున్నారని చెప్పారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని రైతుబీమా అమలు చేస్తున్నారన్నారు. ఇక ఇంటింటికి రక్షిత మంచినీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారని, దీనిద్వారా ఇప్పటికే గ్రామగ్రామానికి మంచినీళ్లు వచ్చాయన్నారు.

పేదింటి ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించిన సీఎం ఇప్పుడు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కింద పెళ్లి కోసం 1,00,116 రూపాయలిస్తున్నారని చెప్పారు. మహిళలు గర్భం దాల్చినప్పుడు కూలీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రసవానికి మూడు నెలల ముందు, ప్రసవం తర్వాత మూడు నెలల పాటు నెలకు 2000 చొప్పున ఆరు నెలల పాటు 12వేలు ఇస్తున్నఏకైక ప్రభుత్వం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. అదేవిధంగా నిండు గర్భిణీ ప్రభుత్వ దవాఖానాకు వెళ్లాల్సి వస్తే 102 నెంబర్ కు ఫోన్ చేస్తే ఏసీ వాహనంలో తీసుకెళ్తారని, అక్కడ ప్రవసమైన తర్వాత తల్లీ, బిడ్డకు అసవరమైన వస్తువులున్న కేసిఆర్ కిట్ అందించి, తిరిగి అదేవాహనంలో ఇంటి దగ్గర దించే గొప్ప ప్రభుత్వం తెలంగాణలో ఉందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి మన మద్దతు పూర్తిగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య, అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు గంగారపు రాజు, కమిటీ చైర్మన్ ఎడ్ల కరుణాకర్, సర్పంచ్ బత్తుల నిర్మలా సూర్యనారాయణ, జనగామా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ స్వామినాయక్, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

6387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles