ప్రగతి నివేదన సభలో భూపాలపల్లి సత్తా చాటాలి: కడియం

Thu,August 30, 2018 03:06 PM

minister kadiyam srihari participated in bhupalappy trs plenary meeting

భూపాలపల్లి: సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో జరగనున్న ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని.. సభకు ఒక రోజు ముందే వచ్చి భూపాలపల్లి సత్తా చాటాలని మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడారు.

టీఆర్ఎస్ పార్టీ కొంగర కలాన్ ప్రగతి నివేదన భారీ బహిరంగ సభ భారత దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుంది. మైలు రాయి కాబోతోంది. ఉద్యమ సమయంలోనూ, అధికారంలోకి వచ్చాక కూడా ఇలాంటి భారీ బహిరంగ సభలు పెట్టే సత్తా, దమ్ము టీఆర్ఎస్ పార్టీకే ఉంది. 25 లక్షల మందితో సభ పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కానీ ప్రజలు అంతకంటే ఎక్కువ సంఖ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేమే వారికి సరిపడా వాహనాలు సమకూర్చే పరిస్థితిలో లేము. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 3 లక్షల మంది తీసుకెళ్లే లక్ష్యంతో సమన్వయం చేసుకుంటున్నాం.

సభ లక్ష్యాలను సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుసార్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 3 నెలల పాలనలో చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి నివేదించడానికి ఈ సభ నిర్వహిస్తున్నాం. సభ సన్నాహక సమావేశాల్లో ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. లక్ష్యం కంటే ఎక్కువ సంఖ్యలో సభకు రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

తెలంగాణ ప్రజల కష్టాలు, సమస్యలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ సీఎంగా ఉండడం మన అదృష్టం. అధికారం లేని వాడు, దోపిడీ దొంగలు రకరకాలుగా మాట్లాడుతారు. వాటికి దీటైన సమాధానం మనం ఇవ్వాలి. పంటరుణం 17 వేల కోట్ల రూపాయలు 4 విడతలుగా మాఫీచేశాం. తెలంగాణ ఉద్యమం చేస్తున్నపుడు నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ రాదు, ఆగం అవుతారని చెప్పాడు. అప్పుడు నాకు కూడా కొంత వరకు అనుమానం వచ్చింది. ఎందుకంటే అప్పటి రాష్ట్రంలో కరెంట్ సరిగా వచ్చేది కాదు. కానీ అలాంటి పరిస్థితిని అధిగమించి కోతలు లేని 24 గంటల ఉచిత విద్యుత్ వరకు వచ్చాము. 24 గంటలు కరెంట్ వద్దు.. బోర్లు ఎండుతున్నాయి.. 12 గంటలు చాలు అనే వరకు రావడం అద్భుతం... సీఎం కేసీఆర్ చేతల్లో చేసి చూపిన అద్భుతం.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత కరెంట్ వ్యవసాయానికి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం పరుగెత్తి ఉప్పలయ్య అనే రైతు గుండె పోటు వచ్చి చనిపోయాడు. ఇది 2008 లో జరిగితే కాంగ్రెస్ ఆయన కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎరువులు, విత్తనాలు కావాల్సినన్ని అందుబాటులో ఉంచారు. ఆ పరిస్థితి లేకుండా చేశారు.

తెలంగాణ ప్రభుత్వంపై విమర్శ చేసే పార్టీ నాయకులు చెప్పాలి.. రైతు పెట్టుబడి కోసం ఏటా ఏకరానికి 8000 రూపాయలు ఇచ్చే రైతు బంధు వంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? రైతు చనిపోతే ఆ కుటుంబ రోడ్డున పడకుండా ఉండాలని ఏటా 2271 ప్రీమియం చెల్లించి రైతు బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది. అవగాహన, సిగ్గులేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు.

72 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా గ్రామాల్లో రక్షిత మంచినీరు లేదని గుర్తించిన సీఎం ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇచ్చేందుకు 46వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ తీసుకొచ్చారు. ఇవన్ని కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదు.. వినిపించడం లేదు. మీకు కళ్ళు కనిపించకపోతే మా కంటి వెలుగులో పరీక్షలు చేయించుకొని అద్దాలు పెట్టుకొని జరిగే అభివృద్ధి చూడండి.

కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు కావాలి..దోచుకోవడానికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మంత్రిగా ఉన్నపుడే కదా ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగి కేసులు బుక్ అయినాయి. నువ్వు నీతి గురించి మాట్లాడుతావా? కాంగ్రెస్ లో అధికారం అడ్డం పెట్టుకొని దోపిడీ, సెటిల్ మెంట్లు, అక్రమాలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు. ఒక్క నల్గొండలో ముగ్గురున్నారు. మహబూబ్ నగర్ లో ఇద్దరు.. ఇలా జిల్లాకు ఎంతమంది ముఖ్యమంత్రులు అవుతారు. అసలు వీరిలో ఎంతమంది ఎమ్మెల్యేలు గా గెలుస్తారు. అసలు ఎమ్మెల్యే గా గెలువలేనప్పుడు సీఎం ఎలా అవుతారు. అసలు వీరిలో ఎవరికైనా కేసీఆర్ ముందు నిలబడే ధైర్యం ఉందా?

స్పీకర్ ప్రతి మంత్రిని అడిగి నిధులు తెస్తున్నారు. ఆర్ అండ్ బి రోడ్లకు 600 కోట్లు, సీసీ రోడ్లకు 100 కోట్ల రూపాయలు తెచ్చారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కి స్పీకర్ మధుసూధనాచారి కుడి భుజం. సీఎం కేసీఆర్ కి స్పీకర్ సన్నిహితులు. మళ్ళీ మధుసూదనాచారి ఎమ్మెల్యే అయితే భూపాలపల్లి స్వరూపమే మారుతుంది. ఎవరైనా పసలేని, పనిలేని మాటలు అన్నా, ప్రచారం చేసినా పట్టించుకోవద్దు. తప్పుడు వార్తలు నమ్మొద్దు. ఎంపీ ఎన్నికల్లో మీరు భారీ మెజారిటీ ఇచ్చారు. కాబట్టి నావంతుగా నేను భూపాలపల్లి కి అన్ని రకాలుగా అండగా ఉంటా.. అని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, పార్టీ నాయకులు సమ్మారావు, పరంజ్యోతి, స్థానిక నేతలు, ఇంఛార్జీలు పాల్గొన్నారు.

1442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles