కేసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి...

Thu,October 11, 2018 05:47 PM

minister kadiyam srihari election campaign in station ghanpur

వరంగల్ :  స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని ఘన విజయంతో గెలిపించేందుకు నేడు హన్మకొండలోని హరిత హోటల్ లో ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్‌పూర్‌ అభ్యర్థి  డాక్టర్ తాటికొండ రాజయ్య, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిశీలకులు, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు బండ ప్రకాశ్, సీతారాం నాయక్, పసునూరి దయాకర్, పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ప్రకటించిన అభ్యర్థి డాక్టర్ రాజయ్య గెలుపు కోసం అందరూ కృషి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు.

సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీనిరద్దు చేసి  ముఖ్యమంత్రి కేసిఆర్ గారు105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులనుప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత అక్కడక్కడ అసంతృప్తులు వస్తే రాష్ట్ర పార్టీ వాటిని గమనిస్తూ, బుజ్జగిస్తూ, ఆశావహులకు నచ్చజెప్తూ, అభ్యర్థులను మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసి ప్రచార సామాగ్రి కూడా ఇచ్చింది. స్టేషన్ ఘన్పూర్ లోకూడా కొంతమంది అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. బహుశా కడియం శ్రీహరి ఘన్పూర్ టికెట్ కు ఆశపడుతున్నారు, ఆయన కుమార్తెకు టికెట్ ఇప్పించాలనుకుంటున్నారు అని  అనుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు.

దీనికి సాక్ష్యం అభ్యర్థి రాజయ్యే.  ఆరునెలల ముందే స్టేషన్ ఘన్‌పూర్‌ నుంచి తాను పోటీ చేయదల్చుకోలేదు మంత్రి కేటిఆర్ కు చెప్పాను. ఈ విషయం రాజయ్యకు చెప్పమని కూడా అన్నాను. కాకపోతే రాజయ్య కొన్ని పద్దతులు మార్చుకొని అందరిని కలుపుకుని వెళ్లాలన్నాను. రాజయ్య కు కూడా ఇది స్వయంగా చెప్పాను. స్టేషన్ ఘన్పూర్ టికెట్ మీదే అని చెప్పాను. మళ్లీ పోటీ చేసేది మీరే అని చెప్పాను. అయితే అందరిని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయండి, నీపై వస్తున్న ఆరోపణలు కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి అన్నాను. వందకు వంద శాతం స్టేషన్ ఘనూపూర్ నియోజకవర్గంలో నీతో వచ్చిన కాంగ్రెస్ వాళ్లు, నాతో వచ్చిన టీడీపీ వాళ్లు, ఉద్యమ కారులు, టిఆర్ఎస్ నాయకులు కలిసి ఉన్నారు, వీరందరిని కలుపుకుని వెళ్లాలి, స్టేషన్ ఘన్పూర్ లో వేరే పార్టీలనుంచి పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలన్నారు.  
 
ఇప్పటి వరకు జరిగిందేదోజరిగింది . ఇప్పుడు కేసిఆర్ నాయకత్వంలో మనమందరం పనిచేయాలి. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ సిఎం కేసిఆర్ అయితేనే రాష్ట్రం భారతదేశంలో అన్ని రంగాల్లో ప్రథమస్థానంలో ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా , ఏ ఒక్క నియోజకవర్గంలో ఫలితాలు తారుమారు అయినా నష్టపోయేది టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం అని గుర్తు పెట్టుకుని పనిచేయాలి.
 
స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కొంతమంది నా దగ్గరకు వచ్చి పోటీ చేయండి అని ఒత్తిడి చేసినా.. నేను పోటీ చేయడం లేదని వారికి చెప్పాను. పార్టీ ప్రకటించిన అభ్యర్థికి సహకరించాలని చెప్పాను. నామీద కూడా కొన్ని వార్తలు కావాలని ప్రచారంలో పెట్టారు. నా జీవితంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. పడనివాళ్లు కావాలని ప్రచారం చేశారు. నేను టిఆర్ఎస్ పార్టీలో ఉంటాను, కేసిఆర్ నాయకత్వంలో ఉంటాను. టీఆర్ఎస్ పార్టీ నాకు బ్రహ్మండమైన అవకాశం ఇచ్చింది, ఎంపీగా ఉన్న నన్ను ఉప ముఖ్యమంత్రిని చేసింది, బ్రహ్మండమైన గౌరవం ఇచ్చింది, కాబట్టి నేను రెండో ఆలోచన చేయనని చెప్పాను. ఆ రోజు కేటిఆర్ సమక్షంలో చెప్పాను, నేడు మళ్లీ అదే చెబుతున్నాను.
 
నా మీద ప్రేమ ఉంటే, టీఆర్ఎస్ పార్టీ బతకాలని ఉంటే, కేసిఆర్ పై విశ్వాసం ఉంటే రాజయ్య గారి అభ్యర్థిత్వాన్ని బలపర్చి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కొందరికి ఇబ్బంది ఉండొచ్చు. అందరిని కలుపుకుని వెళ్లాలి. అందరితో పనిచేయించుకోవాలి. ఎమ్మెల్యేగా నీకు ప్రతి నాయకుని శక్తి, సామర్థ్యాలపై అవగాహన ఉంటుంది. ఏ గ్రామంలో పార్టీ పరిస్థితి ఏమిటీ, ఏ నాయకుడు వంద ఓట్లను ప్రభావితం చేస్తాడో, ప్రజల్లో ఉండే వ్యక్తిని, ప్రజలను ఒప్పించే వ్యక్తిని మన వెంట పెట్టుకోవాలి, కానీ పనికిరానివాళ్లను వెంటపెట్టుకుంటే వారి వ్యతిరేకత మనపై పనిచేస్తుంది. కొంతమందికి ప్రజల్లో ఏమాత్రం పట్టు ఉండదు, కొంతమందిని చూస్తే ప్రజలు నచ్చరు. అలాంటి వాళ్లను దూరంపెడితేనే ఫలితాలు వస్తాయి.
 
ప్రజలకు కేసిఆర్ పై నమ్మకం ఉంది. ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. మనం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయి. కళ్యాణలక్ష్మీ, కేసిఆర్ కిట్, రైతు బీమా, రైతు బంధు, 24 గంటల కరెంటు గురించి దేశంలో ఇప్పటి వరకు ఎవరు ఆలోచించలేదు మన ముఖ్యమంత్రి కేసిఆర్ తప్ప.  ఇవన్నీ ఉండగా ఎదుటివాళ్ల ముందు మనం బొర్ల బొక్కల పడాలా? ఒక్కసారి ఆలోచించాలి. కడియం శ్రీహరికి, రాజయ్యకు గౌరవం ఉంది అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్లే. ముఖ్యమంత్రి కేసిఆర్ కల్పించడం వల్ల ఈ గౌరవం లభించింది. మీరు కల్పించిన గౌరవం ఇది. అందుకే మీకు చేతులెత్తి నమస్కారం చేసి చెబుతున్నా కేసిఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వాళ్లు, మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వం రావాలనుకుంటున్న వాళ్లు, కడియం శ్రీహరి అంటే, రాజయ్య అంటే అభిమానం ఉన్నవాళ్లు సమిష్టిగా, సమన్వయంతో ప్రతి గ్రామంలో, బూత్ స్థాయిలో కలిసి పనిచేస్తేనే రాజయ్యకు విజయం వస్తుంది.
 
మండలస్థాయిలో, గ్రామ స్థాయిలో పాత విషయాలను దృష్టిలో పెట్టుకుని ఎడమోహం, పెడమోహం పెట్టుకుని ఉంటే మన ఫలితాలు మనకు అనుకూలంగా ఉండవు. ఇన్ని రోజులు వ్యక్తిగతంగా, ఆర్ధికంగా ఎన్ని బాధలు, అవస్థలు ఉన్నాయో, ఎన్ని అవమానాలు ఉన్నాయో, అవినీతికి ఏరకంగా బలై పోయారో టిఆర్ఎస్ పార్టీని, కేసిఆర్ గారిని  దృష్టిలో పెట్టుకుని మర్చిపోదాం. మర్చిపోయి రాజయ్యగారి అభ్యర్థిత్వాన్ని బలపర్చి గెలిపించుకుందాం.
 
ఎక్కడ ఎవరి వల్ల పనిఅవుతుందో, వారితో ఆ పని తీసుకుంటేనే ఫలితం వస్తుంది. అందరినీ దగ్గరికి తీసుకుని, గతంలో ఏదో జరిగింది కానీ ఇక నుంచి అందరం కలిసి పనిచేద్దాం, మీ కష్టసుఖాల్లో నేనుంటాను అనే నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకాన్ని కల్పిస్తే మన కోసం పనిచేస్తారు. ఈరోజు వచ్చిన కార్యకర్తలందరూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. వీరంతా రేపు ఎన్నికల్లో సొంత ఖర్చులు పెట్టుకుని పనిచేస్తారు. లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకుని పనిచేస్తారు. కానీ వారందరికీ మళ్లీ మనం మేలు చేయగలమా?, పదవులు ఇవ్వగలమా? ఇవ్వలేము. కానీ వారిని గౌరవంగా చూసి పలకరిస్తే చాలు.

స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు నాకంటే, నాకు టికెట్ కావాలని కొట్లాడుతున్నారు. వారు గెలుస్తారేమోనని వారికి ఏదో నమ్మకం ఉంది. కానీ మనందరం కలిస్తే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. కేసిఆర్ నాయకత్వంలో 2014 ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. 2018 డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు డిపాజిట్ రాకుండా చేసి మన ఐక్యతను, సత్తాను చాటుకోవాలి.
 
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్  రాజయ్య గారికి నా పూర్తి సహాయ సహకారాలుంటాయి. ఇందులో ఎవ్వరికి ఏ రకమైన అనుమానాలు అవసరం లేదు. వందకు వంద శాతం నాపూర్తి సహకారం రాజయ్యకు ఉంటుంది. నన్ను అభిమానించే వాళ్లు వందకు వంద శాతం రాజయ్య కోసం నేను ఎంత నిజాయితీగా చేస్తానో మీరు అంతే నిజాయితీగా రాజయ్య గారి కోసం ప్రచారం చేయాలి, గెలిపించాలి. నియోజక వర్గ సమన్వయ కమిటీ, మండల సమన్వయ కమిటీలు, బూత్ స్థాయి కమిటీలు వేస్తున్నారు. ఇవన్నీ పార్టీ అభ్యర్థి విజయం కోసం తోడ్పడుతాయని భావించి పనిచేయాలి. డిసెంబర్ 7వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజక వర్గం నుంచి మన అభ్యర్థి డాక్టర్ రాజయ్య గారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానని విజ్ఞప్తి చేశారు. 

1551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles