విద్యాశాఖ, సంక్షేమ గురుకులాలపై మంత్రి కడియం శ్రీహరి సమీక్ష

Thu,June 21, 2018 07:35 PM

Minister Kadiyam srihari do review on Education department

హైదరాబాద్: రానున్న నీట్, జేఈఈ పరీక్షల్లో తెలంగాణ గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ విద్యార్థులే అధికంగా సీట్లు కైవసం చేసుకునే విధంగా ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే వారికి కోచింగ్ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆయా సంక్షేమ గురుకుల కార్యదర్శులను ఆదేశించారు. ఈ సంవత్సరం ప్రైవేట్ విద్యా సంస్థల కంటే గురుకుల విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారన్నారు. అయితే మార్కులు సాధించడమే కాకుండా మంచి ప్రమాణాలు కలిగిన విద్యార్థులను రూపొందించే విధంగా విద్యాబోధన, శిక్షణ ఉండాలని సూచించారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల లో చదివే ఆడపిల్లల్లో రక్తహీనత లేకుండా ఉండేందుకు ప్రత్యేక పోషకాహారాన్ని ఇవ్వాలని, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం గైనాకాలజీ డాక్టర్లతో గురుకులాల్లో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, హాస్టళ్లలో ఒకే రకమైన మెను, వసతులు, పాఠ్యాంశాలు, అకాడమిక్ క్యాలెండర్, యూనిఫామ్స్, హెల్త్ అండ్ హైజీన్ కిట్ల పంపిణీ ఉండేలా సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యాశాఖ, ఇతర సంక్షేమ గురుకులాలపై మంత్రి కడియం శ్రీహరి గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది నుంచి విద్యాశాఖ, ఇతర శాఖల్లో విద్యాపరంగా తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల ఫలితాలు మంచిగా వస్తున్నాయని, వీటిని మరింత పెంచాల్సి ఉందన్నారు.

ఆడపిల్లల్లో హెమోగ్లోబిన్ శాతం సాధారణంగా ఉండేదానికంటే తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. ఆడపిల్లల్లోని ఈ రక్తహీనతను అధిగమించేందుకు ప్రత్యేక ఆహారంగా బెల్లంతో తయారు చేసే పల్లీపట్టీలు, నువ్వుల పట్టీలు, రక్తాన్ని పెంచే ఆహారాన్ని ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం నెలకు ఆరుసార్లు మాంసాహారం, వారానికి ఐదు రోజులు గుడ్లు, ఉదయం రాగిమాల్ట్, పాలు, అల్పాహారం ఇస్తున్నామని, మధ్యాహ్నం భోజనంలో 50 గ్రాముల నెయ్యి అందిస్తున్నామని, రాత్రి పూట మంచి భోజనం ఇస్తున్నామని తెలిపారు. దీనివల్ల గురుకుల విద్యార్థులలో చురుకుదనం పెరిగిందని, ఆరోగ్యం బాగుండడం వల్ల చదువు కూడా బాగా చదువుతున్నారని తెలిపారు.
జూలై నుంచి 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు గల బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నామని, ఇందులో బాలికలకు అవసరమైన 13 రకాల 50 వస్తువులున్నాయన్నారు. ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీలవే కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్యంగా బాలికలకు రుతుస్రావ సమస్యలు రాకుండా ఉండేందుకు అవసరమైనన్ని సానిటరీ న్యాప్కిన్స్ అందిస్తున్నామన్నారు. బాలికలలో అనారోగ్య పరిస్థితులను నివారించి, ఆరోగ్య పరిరక్షణ పెంపొందించే విధంగా గైనిక్ డాక్టర్లతో అవగాహన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడే చదువుపై దృష్టిసారించగలరన్నారు. విద్యార్థుల్లో మంచి మార్కులు రావడంతో పాటు వారి ప్రమాణాలు కూడా అదే స్థాయిలో ఉండే విధంగా విద్యాబోధన ఉండాలన్నారు. రానున్న నీట్, జేఈఈ పరీక్షలలో ఎక్కువగా సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని, గురుకుల విద్యార్థులకు కూడా ఇంటర్ మొదటి సంవత్సరం నుంచే ఈ పోటీ పరీక్షల్లో ఎక్కువ సీట్లు సాధించేలా కోచింగ్ ఇవ్వాలని సూచించారు. క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.

1590
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS