పారాచూట్ నాయకులను నమ్మకండి: కడియం

Wed,November 14, 2018 07:00 PM

minister kadiyam speech at stationghanpur after nomination of rajaiah

స్టేషన్ ఘన్‌పూర్: కొంతమంది పారాచూట్ నాయకులు వస్తున్నారు.. డబ్బులు పంచుతున్నారు.. టికెట్ తెచ్చుకుంటున్నారు.. కొన్ని రోజులు తిరుగుతున్నారు.. మళ్లీ ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లిపోతున్నారు.. వీళ్లను నమ్మితే మనకు ఒరిగేదేమీ ఉండదు. కానీ.. డాక్టర్ రాజయ్య మాత్రం నిరంతరం మీకు అందుబాటులో ఉంటారు. రాజన్న అని పిలిస్తే చాలు.. నేనున్నానని వచ్చే వ్యక్తి. పిలిచినా.. పిలవకపోయినా మీ ఇంటికి వచ్చే వ్యక్తి. మన గ్రామానికి వచ్చే వ్యక్తి. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తి. అందుకే.. డాక్టర్ రాజయ్యను గెలిపించుకునే అవసరం మనందరికీ ఉంది... అని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. భారీ జనసందోహంతో, మంత్రి కడియం, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు.

"స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గంలో ముగ్గురు నాయకులున్నారు. కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు ఈ ముగ్గురు నాయకులు అందుబాటులో ఉంటారు.

2014 ఎన్నికలలో నేను ఎంపీగా, రాజయ్య ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ నియోజక వర్గంలో 1,60,000 ఓట్లుంటే, నాకు 1,30,000 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో నాకు ఎంపీగా 90వేల మెజారిటీ వచ్చింది. రాజయ్యకు కూడా ఈసారి 90వేల మెజారిటీ రావాలి.

స్టేషన్ ఘన్పూర్ లో కడియం శ్రీహరి మనుషులు, రాజయ్య మనుషులు, రాజేశ్వర్ రెడ్డి మనుషులు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు, తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నవాళ్లతో చెరువు మత్తడి పోసినట్లుంది. చెరువు మత్తడిపోసినప్పుడు చాపలు జారకుండా చూసుకోవాలి. చాలామంది వలలు పట్టుకుని వస్తున్నారు. డబ్బులు బాగా ఉన్నయని, పంచడానికి వస్తున్నరట. అయితే వాళ్లు  వలలో వేసే బిస్కట్లకు ఎవరు చిక్కరని, మనవాళ్లు ఎవరూ వాటికి ఆశపడరని నాకు నమ్మకం ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే భారతదేశంలో అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్ స్థానంలో ఉంది. కేసిఆర్ సమర్థ నాయకత్వంలో ఊహించని అభివృద్ధిని చేసుకుంటున్నాం. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన పథకాలను అధ్యయనం చేసి వెళ్తున్నారు.

ఆసరా పెన్షన్లు వెయ్యి రూపాయలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు ఇచ్చే పెన్షన్లను రెట్టింపు చేసి వచ్చే ప్రభుత్వంలో 2016 రూపాయలు ఇస్తామని కేసిఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారు. వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 1500 రూపాయలను 3016 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మన ఇళ్లలో చదువుకుని ఉద్యోగం రాని యువతకు నిరుద్యోగ భృతి కింద 3016 రూపాయలు ఇస్తామన్నారు. రైతు బంధు పథకం కింద ఎకరాకి ఇచ్చే 8000 రూపాయలను 10 వేల రూపాయలకు పెంచుతున్నారు. వీటితో పాటు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్, కేజీ టు పీజీలో భాగంగా అనేక గురుకులాలు ఏర్పాటుచేసుకున్నాం. ఇవన్నీ కొనసాగాలంటే భారతదేశంలో తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలంటే మళ్లీ కేసిఆర్ సీఎం కావాలి. రెండోసారి కేసిఆర్ సీఎం కావాలంటే స్టేషన్ ఘన్పూర్ లో రాజయ్య ఎమ్మెల్యేగా గెలువాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలంతా గెలుస్తేనే కేసిఆర్ మరోసారి సీఎం అవుతారు. మన నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

సీఎం కేసిఆర్ స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు , ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు ఇచ్చేందుకు దేవాదుల ప్రాజెక్టులో భాగంగా మల్కాపూర్ – లింగంపల్లి వద్ద భారీ రిజర్వాయర్ ను ప్రకటించారు. దీనికి అగ్రిమెంట్లు అయ్యాయి, త్వరలోనే దీనిపనులు ప్రారంభం అవుతాయి. వచ్చే మూడు సంవత్సరాల్లో  ఈ రిజర్వాయర్ ను పూర్తి చేసి రెండుపంటలకు సాగునీరు ఇచ్చే బాధ్యతను మేం ముగ్గురం తీసుకుంటాం. లింగంపల్లి రిజర్వాయర్ పూర్తయితే స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలోని ప్రతి ఎకరాకు రెండు పంటలకు నీరు వస్తుంది, ఇది మరో కోనసీమ అవుతుంది.

స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గానికి భారీ పరిశ్రమ కావాలని సీఎం కేసిఆర్ ను కోరితే, మెగా లెదర్ పార్క్ ను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే స్టేషన్ ఘన్పూర్ కేంద్రంలోనే మెగా లెదర్ పార్క్ రాబోతోంది. డిగ్రీ కాలేజీని కూడా మంజూరు చేసుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీని ప్రారంభించుకుంటున్నాం. దేవాదుల కాలువల ద్వారా ప్రతి చెరువును నింపాల్సిన అవసరం ఉంది. మూడు నెలలు గోదావరి జలాలను లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మూడు నెలలు ఎట్టి పరిస్థితుల్లో ఈ నీటిని లిఫ్ట్ చేసి స్టేషన్ ఘన్పూర్ లో చెరువులు నింపుతాం.." అని మంత్రి క‌డియం హామీ ఇచ్చారు.

1792
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles