ఈ నెల నుంచే ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం: కడియం

Wed,September 5, 2018 06:00 PM

minister kadiyam participated in the best teachers award ceremony

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఒకేసారి శుభవార్త అందించింది. ఈ నెల నుంచే జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అదేవిధంగా పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్ల గౌరవ వేతనాలు 12 నెలల పాటు ఇచ్చేందుకు కూడా సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.

తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికే 10వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుందని తెలిపారు. సన్నబియ్యంతో పేద విద్యార్థుల కడుపు నింపుతున్న ఈ పథకాన్ని తమకు కూడా వర్తింపచేయాలని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు, అధ్యాపకులు తెలంగాణ ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరాయన్నారు. దీనిని గమనించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై తన నేతృత్వంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలతో కమిటీ వేశారన్నారు. ఈ కమిటీ మధ్యాహ్న భోజనాన్ని కాలేజీలల్లోని విద్యార్థులకు కూడా అమలు చేయాలని ప్రతిపాదించడంతో సీఎం కేసీఆర్ అంగీకరించారని, ఈ నెల నుంచే జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలవుతుందని కడియం శ్రీహరి వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మధ్యాహ్న భోజన పథకం కాలేజీ విద్యార్థులకు ఈ నెల నుంచి అందుబాటులోకి రావడంపై అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఆ కాలేజీలలో పనిచేసే అధ్యాపకులకు కూడా గౌరవ వేతనాన్ని ఇక నుంచి 12 నెలల పాటు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత వేతనాలు లేకుండా ఖాళీ ఉంటున్న అధ్యాపకులు ఇకపై అలా ఉండాల్సిన పనిలేదని తెలిపారు. దీనివల్ల జూనియర్ కాలేజీలలో 3728 మంది, డిగ్రీ కాలేజీల్లో 898 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో 433 మంది కాంట్రాక్టు లెక్చరర్లు మొత్తంగా 5059 మంది లబ్ది పొందనున్నారు.

కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ మానవ వనరుల అభివృద్ధి వల్లే బంగారు తెలంగాణ సాధ్యమని, ఆ బాధ్యతను తనకు అప్పగించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలో ఎక్కువగా బడుగు, బలహీన వర్గాలే ఉండడంతో వారికి ఉచిత విద్యతో పాటు నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా 611 గురుకుల విద్యాలయాలను తెలంగాణలో ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ రాకముందు గత 50 ఏళ్లలో 270 గురుకులాలు ఉంటే...తెలంగాణ వచ్చాక 881 గురుకులాలయ్యాయన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు గత నాలుగు సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 2 లక్షల మంది విద్యార్థులు అదనంగా చేరారన్నారు.

మొదటిసారిగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో కంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారన్నారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యాలయాలపై నమ్మకం పెరగడమే దీనికి నిదర్శనమన్నారు. విద్యార్థుల నమోదు మాత్రమే కాకుండా ఫలితాలు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలే ప్రైవేట్ కంటే ముందంజలో ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలపై రాష్ట్రపతి ఆమోదానికి విరుద్ధంగా హైకోర్టు తీర్పు వచ్చిందన్నారు. అదేవిధంగా కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న కోర్టులు కొట్టివేయడంతో ఆగిపోయిందన్నారు. అయినప్పటికీ వారి వేతనాలు గణనీయంగా పెంచుకున్నామన్నారు. ఇక నుంచి వీరికి 12 నెలల పాటు వేతనాలు అందనున్నాయని చెప్పారు.

ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపునిండా అన్నం పెడుతున్న ప్రభుత్వం మనదని కడియం శ్రీహరి అన్నారు. గురుకుల విద్యాలయాల్లో వారానికి ఆరుసార్లు మాంసాహారం, పాలు, రాగిమాల్ట్, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనంలో 50 గ్రాముల నెయ్యి, సాయంత్రం స్నాక్స్, రాత్రి పౌష్టికాహారం భోజనం పెడుతున్నామన్నారు. ఎదిగే వయసులో విద్యార్థులకు అత్యంత పౌష్టిక విలువలున్న ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ఆహారంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత కోసం బాలికా ఆరోగ్య రక్ష కిట్లను కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్, కేజీబీవీ,మోడల్ స్కూల్స్, గురుకుల విద్యాలయాల్లోని ఆరు లక్షల మంది విద్యార్థినిలకు ఈ కిట్లు అందించడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ 100 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు.

ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంలో ఉపాధ్యాయులే కీలకమని, మరింత నిబద్దతతో పనిచేసి ఈ విద్యా సంస్థలను కాపాడుకోవాలని మంత్రి కడియం శ్రీహరి కోరారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ఎక్కువగా పేద వర్గాల విద్యార్థులే ఉంటారని, వారికి నాణ్యమైన విద్య అందించే సామాజిక బాధ్యతతో పనిచేయాలన్నారు. నిబద్ధతతో పనిచేసే ఉపాధ్యాయులను ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని చెప్పారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే నగదు ప్రోత్సాహాకాన్ని కూడా వచ్చే సంవత్సరం నుంచి పెంచే ఆలోచన ఉన్నట్లు మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు.

ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ కడియం శ్రీహరి సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోకుండా ప్రభుత్వమే ఒక కమిటీ వేసి విద్య పటిష్టతకు, విద్యార్థుల భవిష్యత్ కోసం పనిచేసిన వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించిందని చెప్పారు. అనంతరం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ రూపొందించిన అనుభవాత్మిక అభ్యసనం- గాంధీజీ నయి తాలీమ్ పుస్తకాన్ని కడియం శ్రీహరి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కాటెపల్లి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య సంచాలకులు విజయ్ కుమార్, వివిధ విశ్వవిద్యాలయాల కులపతులు హాజరయ్యారు.

3478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles