వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ దిక్సూచి కావాలి

Sat,March 17, 2018 10:11 PM

minister kadiyam meeting on warangal development

వరంగల్: చారిత్రక వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ దిక్చూచిగా ఉండాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం మాస్టర్‌ప్లాన్‌పై కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. మాస్లర్ ప్లాన్‌ను రూపొందిస్తున్న లీ అసోసియేట్స్ ప్రతినిధులు కొత్త మాస్టర్‌ప్లాన్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్‌లో ప్రత్యేకంగా వరంగల్ నగరం అభివృద్ధి కోసం ఏడు అంశాలను పొందుపరిచామని వారు వివరించారు.

భవిష్యత్ అవసరాలు, బిల్డింగ్ బ్లాక్, అంతర్గత రహ దారులు, పర్యాటక అభివృద్ధి, రవాణా, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అంశాలను పరిగణలోకి తీసుకు న్నామని లీ అసోసియేట్స్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఏప్రిల్ 15లోగా తుది ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో నగరానికి వస్తున్నారని, అంతకంటే ముందే ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఉంచాలన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ నోటిఫికేన్ విడుదల చేస్తామని ఆయన అన్నారు.

చారిత్రక వరంగల్ నగరంలో పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లో మార్గనిర్దేశాలను పొందుపర్చాలని సూచించారు. నేషనల్ హైవే 163 వైపు ఇండస్ట్రీయల్ కారిడార్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వైపు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లో దిశా నిర్దేశం చేయాలని అన్నారు. వరంగల్ నర్సంపేట రహదారిపైపు మెగా టెక్స్‌టైల్ పార్క్, వ్యవసాయ మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఆ వైపు ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు ఉండేలా మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చాలని అన్నారు. వరంగల్ నుంచి భూపాల పట్నం నేషనల్ హైవే ప్రధానమైనదని ఆయన అన్నారు. భూపాలపట్నం, రాయపూర్, భువనేశ్వర్ రోడ్డు అనుసంధానమైతే కలకత్తా జాతీయ రహదారి మార్గం సుగమం అవుతుందని అన్నారు. దీని ద్వారా సుమారు 400 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆయన అన్నారు. ఈ దిశగా ట్రక్ టర్మినల్ అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్‌లో పొందుపర్చాలని అన్నారు. వరంగల్‌లోని భద్రకాళి, వడ్డేపల్లి, ధర్మసాగర్ చెరువులను పర్యాటకులను ఆకర్శించేలా మాస్టర్ ప్లాన్‌లో ప్రణాళికలు ఉండాలని అన్నారు. చెరువుల వద్ద రెస్టారెంట్లు, వాటర్‌గేమ్స్‌లతో అభివృద్ధి చేయాలని సూచించారు. నగర నడిబొడ్డులో ఉన్న ఆటో నగర్‌ను తరలించేందుకు అనువైన సూచనలు మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరచాలని అన్నారు.

ఎయిర్‌పోర్ట్‌తోపాటు ఇటీవల మంజూరైన నేషనల్ హైవేలను దృష్టిలో ఉంచుకొని వరంగల్ రహదారుల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌లో చోటు ఉండాలని ఆయన సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానం చేసే నగర రోడ్ల అభివృద్ది జరిగేలా మాస్టర్ ప్లాన్ ఉండాలని అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదనలు ఉండాలని అయన సూచించారు. 2018-19 బడ్జెట్‌లో నగరాభివృద్ధికి కేటాయించిన రూ.300 కోట్లు పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, రూరల్ కలెక్టర్ హరిత, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, కమిషనర్ వీపీ గౌతమ్, కుడా ప్లానింగ్ అధికారి అజిత్ రెడ్డి, లీ అసోసియేట్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

1548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles