త్రిపురలో మంత్రి జోగు రామన్న

Mon,April 16, 2018 08:08 PM

Minister Jogu ramanna visits tripura

అగర్తల: రాష్ట్ర మంత్రి జోగు రామన్న త్రిపురలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా త్రిపుర రాజధాని అగర్తల శివారులోని జోగేందుర్ నగర్‌లో ఉన్న త్రిపుర రాష్ట్ర వెదురు పారిశ్రామిక వాడను మంత్రితో పాటు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ సందర్శించారు. మేదర కుల వృత్తిదారులు ఆధునిక విధానాన్ని అనుసరించేందుకు ఈ వెదురు చేతి వృత్తి కళ ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. త్రిపురలో వెదురుతో తయారువుతున్న పలు రకాల ఉత్పత్తులను వాళ్లు పరిశీలించారు.

రబ్బరుతో తయారయ్యే కలప ఉత్పత్తులను పరిశీలించారు. రబ్బరు కలప మేదర కుల వృత్తిదారులకు వరంగా మారుతుందన్నారు. మేదర కులస్తులకు ఆధునిక యంత్రాలను సమకూర్చి, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి వారికి మెరుగైన జీవనాన్ని కల్పించడమే తెలంగాణ ప్రభుత్వం ధ్యేయమని వాళ్లు పేర్కొన్నారు. రబ్బరు కలపతో పలు రకాల ఫర్నీచర్ తయారు చేసే విధానాన్ని కూడా వాళ్లు పరిశీలించారు.

రాష్ట్ర బృందంతో పాటు త్రిపుర అధికారులు పర్యటించి త్రిపురలో రబ్బరు ఉత్పత్తిపై వివరించారు. త్రిపురలో 11,630 హెక్టార్లలో రబ్బరు చెట్లు ఉన్నాయని.. తద్వారా 60 వేల మెట్రిక్ టన్నుల రబ్బరు ఉత్పత్తి అవుతున్నదని.. దీంతో ప్రతి ఏటా రూ. 10 కోట్ల లాభాలను ఆర్జిస్తున్నట్లు త్రిపుర అధికారులు పేర్కొన్నారు.

అనంతరం త్రిపుర రాష్ట్ర ప్రతిష్ఠాత్మక హస్త కళా కేంద్రాన్ని జోగు, శ్రీనివాస్ సందర్శించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పలు హస్త కళా వైభవాన్ని స్వయంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అగర్తల శివార్లలో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దును సందర్శించి.. ఇండియా - బంగ్లాదేశ్ సైనికుల కవాతును తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సీఈవో అలోక్ కుమార్, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు తుల శ్రీనివాస్, మేదర కుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

1481
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS