బీజేపీని ప్ర‌జ‌లు బండ‌కేసి ఉతక‌డం ఖాయం

Wed,July 11, 2018 06:48 PM

minister jogu ramanna criticizes bjp party in media meet held at secretariat

హైద‌రాబాద్‌: బీజేపీ నాయ‌కుల మాట‌లు మాయ‌ల ఫ‌కీర్‌ను త‌ల‌పించేవిగా ఉన్నాయ‌ని బీసీ సంక్షేమం, అట‌వీ శాఖ‌ల మంత్రి జోగు రామ‌న్న విమ‌ర్శించారు. బీజేపీ రాష్ర్ట అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇవాళ స‌చివాల‌యంలో మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

ప్ర‌జా క్షేత్రంలో బీజేపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మునిగిపోయే ప‌డ‌వ బీజేపీదేన‌ని ఆయ‌న అన్నారు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే తెలంగాణ ప్ర‌జ‌లు స‌హించ‌ర‌ని, బీజేపీని బండ‌కేసీ ఉత‌క‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న అన్నారు. మ‌తి భ్ర‌మించిన బీజేపీ నాయ‌కులు ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని మంత్రి జోగు రామ‌న్న స్ప‌ష్టం చేశారు.

టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి రాకుంటే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ఆయ‌న విస్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటారా? అని ఆయ‌న బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌కు స‌వాల్ విసిరారు. అవినీతిని పెంచిపోషిస్తున్న బీజేపీ పాల‌న‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ బీజేపీయేన‌ని ఆయ‌న అన్నారు.

బీజేపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వేలాది కోట్ల రూపాయ‌ల ప్ర‌జా ధ‌నాన్ని మింగేసీన నిరవ్ మోదీ, విజ‌య్ మాల్యా వంటి ప్ర‌ముఖులు ద‌ర్జాగా విదేశాల్లో తిరుగుతున్నా.. వారిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్న‌మే చేయ‌ని బీజేపీ పెద్ద‌లు త‌మ‌ను విమ‌ర్శిస్త‌రా.? అని ఆయ‌న నిల‌దీశారు. విదేశాల్లోని న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీస్తాన‌న్న బీజేపీ నాయ‌కులు నాలుగేళ్లు దాటినా దాని ఊసే ఎత్త‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు.

న‌ల్ల‌ధ‌నం వెన‌క్కి తెస్తాన‌న్న బీజేపీ నాయ‌కులు.. బ్యాంకుల్లో ఉన్న ప్ర‌జ‌ల ధ‌నాన్ని ఊడ్చుకుపోయార‌ని మంత్రి జోగు రామ‌న్న ఆరోపించారు. నోట్ల ర‌ద్దు పేరుతో సామాన్య ప్ర‌జ‌ల‌ను పిచ్చోళ్లుగా మార్చార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. జ‌న్‌ధ‌న్ పేరిట బ్యాంక్ అకౌంట్లు తెరిపించిన బీజేపీ నాయ‌కులు.. ఆ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి తీసుకునే ప‌రిస్థితి లేకుండా మ‌హిళ‌ల‌ను మోసం చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. బీజేపీ నాయ‌కుడు ల‌క్ష్మ‌ణ్ ప‌గ‌టి క‌ల‌లు క‌న‌డం మానేసి, వాస్త‌వ ప‌రిస్థితుల్లో జీవించాల‌ని ఆయ‌న సూచించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను బీజేపీ పాలిత రాష్ర్టాలు, కేంద్ర మంత్రులు అభినందిస్తున్న విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని మంత్రి జోగు రామ‌న్న హిత‌వు ప‌లికారు.

3922
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles