రైతు సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం

Sun,August 25, 2019 08:26 PM

Minister Jagadish Reddy Inaugurated Electrical Substation

హాలియా: రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం అల్వాల గ్రామంలో రూ. 1.10 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆదివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం నందికొండలో ఏర్పాటు చేసిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడారు.

ప్రతి రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గతంలో రైతులు సాగు వదిలేసి ఇతర రంగాలవైపు మళ్లే వారని, కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం సాగుకు అందిస్తున్న ప్రోత్సాహంతో సాగు పండుగలా మారిందని, తాను రైతునని గర్వంగా చెప్పుకునే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక వ్యవసాయ రంగంపై రైతులకు విశ్వాసం కలిగించడానికి, ధైర్యం నింపడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించి రికార్డు సృష్టించినట్లు తెలిపారు.

తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చడానికి తొలితరం తెలంగాణ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ మూలస్తంభమని, ఆమె పోరాటం, తెగువ, సాహసం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నాంది పలికిందన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు. తెలంగాణ యావత్తు ప్రజలు వీరనారి ఐలమ్మకు రుణపడి ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, వేంరెడ్డి నర్సింహారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ ఇస్లావత్ రామచందర్‌నాయక్, టీఆర్‌ఎస్ నాయకులు ఎంసీ. కోటిరెడ్డి, కేవీ రామారావు తదితరులు పాల్గొన్నారు.

930
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles