జానారెడ్డిని ఓడిస్తేనే నాగార్జునసాగర్ అభివృద్ధి

Mon,October 29, 2018 10:15 PM

minister jagadish reddy election campaign at nagarjuna sagar

హాలియా : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 35ఏండ్లుగా కుంటుపడిన అభివృద్ధి జరగాలంటే జానారెడ్డి ఓడిస్తేనే సాధ్యమవుతుందని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుమలగిరి (సాగర్) మండలం నెల్లికల్ గ్రామంలో జరిగిన టీఆర్‌ఎస్ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఎమ్మెల్యేగా ఏడుసార్లు గెలిచి, అత్యధిక కాలం మంత్రిగా చేసిన జానారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. తెలంగాణను నాశనం చేసిన చంద్రబాబునాయుడితో జానారెడ్డి దోస్తీ కట్టి తెలంగాణ ప్రజలను నిలువెల్లా మోసం చేయడానికి మహాకూటమి పేరుతో మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. మహాకూటమికి ఓటు వేస్తే మళ్లీ 35ఏండ్లు సాగర్ నియోజకవర్గ ప్రజలు వెనుకబాటుకు గురవుతారని అన్నారు.

తలాపునే కృష్ణానది ఉన్నప్పటికి జానారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నాగార్జునసాగర్ అనేక గిరిజన తండాల్లో తాగు నీరు లేక జనం అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టి 60ఏండ్లు అవుతున్నా, ఎడమకాల్వ నీటి విడుదల జరిగి 50ఏండ్లు కావస్తున్నా రాజవరం, సూరేపల్లి, ముదిమాణిక్యం, వజీరాబాద్ మేజర్ కాల్వల పరిధిలోని చివరి భూములకు ఏనాడు సాగునీరు రాకపోవడానికి జానారెడ్డే కారణం కాదా..? అని మంత్రి జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డి తన మంత్రి పదవుల కోసం ఏనాడు నియోజకవర్గ ప్రజల పరిస్థితులను పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు. కృష్ణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి నెల్లికల్ లిప్టు పథకాన్ని రూ.76కోట్ల వ్యయంతో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

నెల్లికల్‌తో పాటు కృష్ణపట్టే ప్రాంతంలోని మరిన్ని లిప్టులను ఏర్పాటు చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణలో టీడీపీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటువేయడం అంటేనే సాగర్ ఎడమకాల్వ కింద రైతులు నీళ్లు వద్దు అని అగ్రిమెంట్ రాసినట్లవుతుందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల విభజనను అడ్డుకున్న చంద్రబాబు పార్టీతో కాంగ్రెస్ ఏ రకంగా పొత్తు పెట్టుకుంటుందని?, అక్రమంగా తెలంగాణలోని ఏడు మండలాలను గుంజుకున్న చంద్రబాబుతో పొత్తు తెలంగాణ ప్రజలను నయవంచన చేయడానికే వస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేతిలో జానారెడ్డి తోలుబొమ్మలా మారారని తీవ్రంగా విమర్శించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సాగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles