ఉమ్మడి జిల్లాకు పట్టిన శాపం కాంగ్రెస్.. ఆ పార్టీ పెంచి పోషించిన బిడ్డే ఫ్లోరైడ్: జగదీశ్ రెడ్డి

Thu,April 25, 2019 10:13 PM

minister jagadeesh reddy fires on congress party in narketpally meeting

నార్కట్‌పల్లి: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పట్టిన శాపమే కాంగ్రెస్ పార్టీ అని.. ఆ పార్టీ పెంచి పోషించిన ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నదని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. పూటకో అబద్ధంతో ఇంకా మోసం చేస్తున్న కాంగ్రెస్ నేతల దుర్మార్గానికి చరమగీతం పాడాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఫ్యూడల్ మనస్తత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికీ బయట పడలేకపోతున్నారని, అటువంటి నేతల చేతుల్లో చిక్కిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లాను ఏలిన నేతలు వారేనని అటువంటి నేతలే ఫ్యూడల్ భావజాలంతో అభివృద్ధి నిరోధకులుగా నిలిచారని దుయ్యబట్టారు. మొన్నటి శాసన సభ ఎన్నికలలో అధికారంలోకి వస్తే యాదాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ప్రకటించినందుకే జిల్లా ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని, మొన్నటి శాసన సభ ఎన్నికలలో ఏలిననాటి శనిని వదిలించుకున్నారన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి, నల్లగొండ రెండు స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ విజయం ఖాయమని, ప్రాదేశిక ఎన్నికల్లోనూ మూడు జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా ఎగురుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తారతమ్య బేధం లేకుండా అభివృద్ధి జరుగుతుందని అందుకు నిదర్శనం మొన్నటి ఎన్నికలలో వచ్చిన ఫలితాలేనని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో నాశనం అయిన దేవరకొండ, మునుగోడులతో పాటు అభివృద్ది జాడలేని నకిరేకల్ నియోజక వర్గంలో పంట పొలాలకు సమృద్దిగా నీరు అందుతుందన్నారు.

వచ్చే నెలాఖరు వరకు ఉదయసముద్రం ప్రాజెక్టు పూర్తి చేసి ట్రయల్ రన్ చేస్తామని పేర్కొన్నారు. అనేక అభివృద్ది ఫలాలను అందుకుంటున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీని లేవనివ్వకూడదన్న స్థిరమైన నిర్ణయానికి వచ్చారన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ అభివృద్దికి ఆకర్షితులై స్థానిక శాసన సభ్యుడు చిరుమర్తి లింగయ్య గులాబి గూటికి చేరారన్నారు.

1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles