రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పి గెలిచారు: హరీష్ రావు

Sat,August 4, 2018 08:10 PM

వికారాబాద్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొడంగల్‌లో టీఆర్‌ఎస్ జెండా ఎగురుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి కొడంగల్‌లో గెలిచారని తెలిపారు. కోస్గిలో నిర్వహించిన టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొని హరీష్ రావు ప్రసంగించారు. హరీష్‌రావుతో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.


బహిరంగసభలో హరీష్ రావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుబంధు పథకం తీసుకొచ్చాం. రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8వేల పంట పెట్టుబడి సాయం అందిస్తున్నాం. సీఎం కేసీఆర్ పాలన చూసి ఇతర రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారు. 15 రోజుల్లో కృష్ణానది జలాలు ప్రతి ఊరికి అందిస్తాం. ఆగస్టు 15 నుంచి రైతులకు రూ.5లక్షల ఉచిత బీమా అందించబోతున్నాం. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారు.


తెలంగాణ ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్పాలని హరీష్ పేర్కొన్నారు. కోస్గి, కొడంగల్‌లో రూ.10కోట్ల ఖర్చుతో 50 పడకల ఆస్పత్రులు మంజూరయ్యాయి. కొడంగల్‌లో రూ.124కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.18కోట్లతో 10 సబ్‌స్టేషన్లు మంజూరు చేశాం. 72 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. మరో 15ఏండ్లు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటది. కొడంగల్‌లో లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకొస్తాం. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో కోటి మందికి ఉచితంగా కళ్లద్దాలు అందిస్తాం. కోస్గిలో ఆధునిక కూరగాయల మార్కెట్‌ను నిర్మిస్తామని చెప్పారు.

పాలమూరు అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదు. కాళేశ్వరం ప్రాజెక్టును దేశం మొత్తం మెచ్చుకుంటోంది. అన్ని రంగాల్లో తెలంగాణే నెంబర్‌వన్ స్థానంలో ఉందని ఆయన అన్నారు. అభివృద్ధి ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తొందరగా పూర్తి చేస్తున్న ఘనత హరీష్‌రావుదేని ప్రశంసించారు. మన ప్రాజెక్టులు చూడటానికి దేశ విదేశాల నుంచి వస్తున్నారన్నారు.

3688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles