సేంద్రియ ఉత్పత్తుల వెబ్‌సైట్ ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

Tue,December 3, 2019 05:43 PM

సిద్దిపేట నియోజకవర్గంలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల వివరాలు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వెబ్‌సైట్, ప్రత్యేక యాప్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... క్యాన్సర్‌వంటి వ్యాధులు‌ పెరుగుతుండటానికి కారణం మనం తీసుకునే కలుషిత ఆహారం నీరు, గాలి కారణమని చెప్పారు. విచ్చల విడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతూ పంటలు‌ పండించడం వల్ల ‌క్యాన్సర్ కేసులు ‌ఎక్కువవుతున్నాయన్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో సేంద్రీయ ఆహార ఉత్పత్తులపై మక్కువ ‌ఏర్పడిందన్నారు. ఇవాళ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల‌ గ్రామంలో‌జరిగిన సేంద్రీయ, వ్యవసాయ రైతుల సమావేశంలో పాల్గొన్నారు. సేంద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం https://siddipetorganicproducts.com/ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ వెబ్ సైట్‌ ద్వారా సేంద్రీయ ఉత్పత్తులను దేశంలో ఏ మూల నుంచి అయినా కొనవచ్చన్నారు.

ఈ వెబ్ సైట్‌లో సేంద్రీయ వ్యవసాయం ‌చేసే రైతు వివరాలు, పొలం, ఫోటోలు, పంట‌వివరాలు, ఫోన్ నెంబరు వంటివి ఉంటాయన్నారు. సేంద్రీయ ఉత్పత్తులను దళారీల ప్రమేయం లేకుండా రైతుల‌ నుంచే నేరుగా కొనుగోలు చేయవచ్చన్నారు. సేంద్రీయ రైతులకు మంచి ధర వచ్చేందుకు, కొనుగోలు దారులకు నిజమైన సేంద్రీయ ‌ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.

హైదరాబాదులో ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో ఎరువులు, పురుగు మందులు వాడిన ఆహార ఉత్పత్తులు అమ్ముతున్నారని ఆక్షేపించారు. నిజమైన ఆర్గానిక్ ఉత్పత్తులు కావాలనుకునే వారు ఈ వెబ్ సైటు నుంచి కొనుగోలు‌చేయాలని సూచించారు. ఇది తొలి అడుగు మాత్రమేనని, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు పంట మార్పిడి పద్ధతి అవలంబించాలన్నారు. యాభై ఎకరాలకు ఒక క్లస్టర్ గా విభజించి సేంద్రీయ వ్యవసాయం ‌చేస్తే వారికి ప్రభుత్వం నుంచి మూడేళ్లపాటు విడతల వారీగా 15 లక్షల రూపాయల సాయం అందిస్తామన్నారు.

నాబార్డు ద్వారా వ్యవసాయ యంత్రపరికరాలు, మార్కెటింగ్ సదుపాయాలు సమకూర్చుతామని మంత్రి హరీష్ రావు చెప్పారు. కార్పొరేట్ సంస్థల సాయంతో రైతులకు ఆవులను సమకూర్చుతామన్నారు. అంతర్జాతీయ కంపెనీలు సైతం ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ‌అనుసంధానిస్తామని మంత్రి చెప్పారు. రైతులు నమ్మకం గా ఆర్గానిక్ వ్యవసాయం ‌చేస్తే కొనుగోలు‌దారులు పొలాల వద్దకే వచ్చి పంట‌కొనుగోలు చేస్తానని చెప్పారు. వరంగల్,‌సిద్దిపేట రైతు బజారులో సేంద్రీయ ఉత్పత్తులు ‌అమ్మడానికి ఉచితంగా స్టాల్స్ ఇస్తామన్నారు. రైతులు ఆర్గానిక్ వ్యవసాయం పై దృష్టి సారించాలని చెప్పారు. ఈ సమావేశంలో రైతులకు మంత్రి హరీష్ రావు ఆర్గానిక్ వ్యవసాయ పనిముట్లను అందజేశారు.

1047
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles