మంత్రిలా కాదు.. పెద్ద మేస్త్రీలా పని చేస్తా: హరీశ్

Wed,June 13, 2018 07:36 PM

Minister Harish rao do review meeting on Mahaboob nagar projects

హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తయ్యే వరకు మంత్రిలా కాకుండా పెద్ద మేస్త్రీలా పని చేస్తానని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని.. ఆ సమస్య పరిష్కారానికి అన్ని స్థాయిలో కృషి చేద్దాంమన్నారు. బుధవారం ఆయన జల సౌధలో మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ల, నెట్టెంపాడు ప్రాజెక్టు పనులపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల ఇంజినీర్లు, గుత్తేదారులు హాజరయ్యారు. ప్రాజెక్టుల వారీగా, ప్యాకేజీల వారీగా మంత్రి సమీక్ష జరిపారు. బీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ల ప్రాజెక్టు ల్లో భూసేకరణ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్య ఉన్న చోట జిల్లా కలెక్టర్లు, ఎస్.డీ.సీలు, ప్రాజెక్టు ఇంజనీర్లు కలిసి భూసేకరణలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతీ రోజు పని తీరును మదింపు చేసుకుని.... లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. బీమా ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్ లో బీమా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్యాకేజీ పనులు ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాల్సిందేనన్నారు. బీమా ప్రాజెక్టు పనులకు సంబంధించిన చెల్లింపులు ఎక్కడా ఆగకుండా తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. పనులు పూర్తయిన వెంటనే చెల్లింపులు జరిగేలా జాగ్రత్త పడుతున్నామన్నారు. ఎజెన్సీలు ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తరచూ సమీక్షలు నిర్వహిస్తూ... పనుల పురోగతిని, తదుపరి లక్ష్యాలను అంచనా వేసుకోవాలన్నారు.

కోయిల్ సాగర్ పనుల పురోగతిని మంత్రి సమీక్ష జరిపారు ఈ ప్రాజెక్టు పరిధిలో ప్యాకెజి 13, ప్యాకెజి 14 పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్యాకెజీ 13 లో భూసేకరణ జరిగిన చోట గుత్తెదారులు పనులు చేయడం లేదన్న అంశాన్ని ఇంజనీర్లు మంత్రి దృష్టికి తేగా, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. మిగిలిన భూసేకరణకు కలెక్టర్లు, ఎస్.డీ.సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాట చేసుకుని పూర్తి చేయాలన్నారు. తుమ్మిళ్ల ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసి ఆగష్టు 15 లోగా ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. కార్మికుల సంఖ్యను పెంచాలని ఎజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. పంపులు, మోటార్ల చైనా నుంచి రావాల్సి ఉందని... ఎజెన్సీ ప్రతినిధులు చెప్పగా... వాటిని ఎయిర్ కార్గో ద్వారా తెప్పించి సమయాన్ని ఆదా చేయాలని సూచించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన లిఫ్ట్ ల సంసిద్ధతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సీజన్ లో లిఫ్ట్ లు పని చేసేలా సిద్దం చేయాలన్నారు. లిఫ్ట్స్ సలహాదారు పెంటారెడ్డితో మహబూబ్ నగర్ ప్రాజెక్టు లిఫ్ట్ లలో కొత్తగా అపాయింట్ అయిన ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ ను ఆదేశించారు.

కల్వకుర్తి ప్రాజెక్టు పనులపై సమీక్ష చేసిన మంత్రి హరీష్ రావు అనుకున్న సమయంలోగా పనులు పూర్తి చేయాలన్నారు. సున్నా నుంచి 90 కిలోమీటర్ల ప్రధాన కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. 90 నుంచి 130 కిలోమీటర్ల ప్రధాన కాలువ లో నిర్మాణాలు పూర్తి కాకున్నా...నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు పనులు నిర్వహిస్తోన్న ఎజెన్సీలు పని చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై రెండు రోజుల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తానని.. ఈ నెలాఖరులోగా వస్తానని చెప్పారు. ప్రాజెక్టు పనుల్లో కార్మికుల కొరతను గుత్తెదారులు, ఇంజనీర్లు మంత్రి హరీష్ రావు దృష్టికి తేగా... అప్పటికప్పుడు కాంతనపల్లి ప్రాజెక్టులో నీరు రావడంతో అక్కడ కార్మికులకు పని లేదని తెలుసుకున్న మంత్రి వారిని మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల్లో అవసరమైన చోటకు కార్మికులను పంపాలని సీఈని ఆదేశించారు. ఎజెన్సీలు కార్మికుల కొరతపై ఫిర్యాదు చేస్తున్నారని... తానే స్వయంగా పెద్ద మెస్త్రీలా వ్యవహరించి... ఆయా పనులు తగ్గిన ఎజెన్సీ ల నుంచి కార్మికులను కాళేశ్వరం ప్రాజెక్టులో ఆయా ప్యాకేజీ పనుల నిమిత్తం ఛనాకా- కోరాట ప్రాజెక్టు నుంచి ఖమ్మం జిల్లా నుంచి తరలించానని చెప్పారు. ఇదే రీతిలో సీఈలు, ఎస్.ఈలు హోదాను దృష్టిలో పెట్టుకోకుండా...ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు.

2592
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles