టీఆర్‌ఎస్‌పై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, బీజేపీలకు లేదు..

Sat,June 8, 2019 10:22 PM

minister errabelli fires on bjp and congress

వరంగల్: టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసం ప్రాదేశిక ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని, ప్రజాతీర్పును గౌరవించకుండా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాయని, దొంగ దీక్షలు చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు.

ఈవీఎంలతో తమ ఫలితాలు తారుమారు అవుతాయని, వాటిని బంద్ చేయించాలని దేశమంతా తిరిగిన వారికి బ్యాలెట్ పోరులోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరింటికి ఆరు జెడ్పీల్లో గులాబీ జెండా ఎగిరిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ వల్లే ఇంత అద్భుత విజయం సాధించామని, వారిద్దరికి ఈ విజయాన్ని బహుమతిగా ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుంచి ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, వొడితెల సతీష్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, గండ్ర వెంకటరమణారెడ్డిలతో కలిసి ఎర్రబెల్లి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 70 ఎంపీపీ స్థానాలకు 58 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుందని, అదే సమయంలో ఆరింటికి ఆరు జెడ్పీలపై గులాబీ జెండా ఎగరవేశామని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి, ఉద్యమం చేసిన వారికి అందరికీ సరైన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించామన్నారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసి తమ ఉనికిని చాటుకునేందుకు మరోసారి తప్పు చేస్తుందని ఆయన అన్నారు.


ఆనాడు టీఆర్‌ఎస్ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న విషయాన్ని ఆయన ఉదహరించారు. రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే తాము తమ తమ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్న తరువాత ఎన్నికలు వచ్చాయని, ఇలా మద్దుతు ఇస్తాం అని ప్రకటించినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అద్భుత ఫలితం సాధించిందని పేర్కొంటూనే ఒకవేళ ప్రజలకు టీఆర్‌ఎస్ చేసేది తప్పు అని తెలిస్తే తమ పార్టీ ఎన్నికల్లో ఇంతటి ప్రజాదరణ ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌కే ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వానికి సహకరించాలని, పాలనలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకుంటామన్నారు. అంతేకానీ ప్రభుత్వంపైనా, తమ పార్టీపైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఎర్రబెల్లి హెచ్చరించారు.

1153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles