63 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ : ఈటల

Tue,November 14, 2017 04:05 PM

Minister Eetala Rajender clarification on Govt Jobs recruitment

హైదరాబాద్ : రాష్ట్రంలో 4,41,995 ఉద్యోగాలు ఉంటే.. 1,08,132 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో భాగంగా 63,152 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. మిగిలిన ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై శాసనసభలో లఘు చర్చ సందర్భంగా ఉద్యోగ నియామకాలపై మంత్రి వివరణ ఇచ్చారు.

నేడు అన్ని ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. నిరుద్యోగ సమస్య అని మంత్రి పేర్కొన్నారు. చదువంటేనే ఉద్యోగాలు కాదన్నారు. అన్ని సమస్యలను రాజకీయ కోణంలో చూడాల్సిన అసవరం లేదన్నారు. రెండు శాతం కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలుండవు అని చెప్పారు. అందరూ చెప్పినట్లుగానే.. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్ పెట్టుకొని తెలంగాణ సాధించామని తెలిపారు. అందుకనుగుణంగానే ఒక్కొక్కటి నెరవేర్చుకుంటున్నామని మంత్రి చెప్పారు.

27,744 ఖాళీలను భర్తీ చేశాం
రాష్ట్రంలో ఇప్పటి వరకు 27,744 ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా 5,932 ఉద్యోగాలు, సింగరేణిలో 7,266, విద్యుత్ శాఖలో 1,427, పోలీసు శాఖలో 12,157 పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు మంత్రి. మిగతా ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి స్పష్టం చేశారు.

2 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేరు
ఏ ప్రభుత్వమైనా 2 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదని మంత్రి ఈటల తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రూ. 1500 కోట్లు కేటాయించామని చెప్పారు. కమల్‌నాథన్ కమిటీ ఇప్పటికి వంద శాతం ఉద్యోగ విభజన పూర్తి చేయలేదన్నారు. ఇంకా 1400 మంది ఉద్యోగుల విభజన జరగాల్సి ఉందన్నారు. ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయన్నారు. నిరుద్యోగం క్రమక్రమంగా తగ్గుతుందన్నారు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా.. విద్యార్థులు, నిరుద్యోగులు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచాం
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ప్రయత్నించినప్పటికీ కోర్టు 1996కు ముందున్న వారిని మాత్రమే క్రమబద్దీకరించాలని కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు మంత్రి. ఆ ప్రక్రియ కంటే ముందే సీఎం కేసీఆర్ సమాన పనికి సమాన వేతనం విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 20 వేల మంది(కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్) ఉద్యోగులకు జీతభత్యాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.

టీఎస్‌పీఎస్సీ గొప్పగా పని చేస్తుంది
టీఎస్‌పీఎస్సీ(తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) దేశంలోనే గొప్పగా పని చేస్తుందని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ర్టాల మంత్రులు, అధికారులు టీఎస్‌పీఎస్సీని మెచ్చుకుంటున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. టీఎస్‌పీఎస్సీ పారదర్శకంగా పని చేస్తుందని ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు 73 నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. ఉద్యోగాలు అమ్ముకున్న వార్తలు, లంచాలు, అక్రమాలు జరిగినట్లు ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ చరిత్రలో లేదన్నారు. టీఎస్‌పీఎస్సీపై అపారమైన నమ్మకం విశ్వాసం ఉందన్నారు. రాబోయే కాలంలో టీఎస్‌పీఎస్సీ గొప్ప సంస్థగా నిలుస్తుందన్నారు.

ఐటీ రంగంలో తెలంగాణ నెంబర్ వన్
ఐటీ రంగంలో తెలంగాణ నెంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. 2014-17 మధ్య ఐటీ ఎగుమతులు రూ. 30 వేల కోట్ల మేర పెరిగాయన్నారు. ఆపిల్ కంపెనీ బెంగళూరుకు తరలిపోయిందనడంలో వాస్తవం లేదు.. ఇక్కడే ఏర్పాటు అవుతోందన్నారు. ఆపిల్ కంపెనీని హైదరాబాద్‌లో నెలకొల్పడం గౌరవంగా భావించాల్సిన విషయమని చెప్పారు. ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అనేక సంస్థలు మూతపడి.. ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని తెలిపారు. కానీ తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చాయన్నారు. పెట్టుబడుల ద్వారా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 54 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడి.. అనేక రకాలను అధిగమించి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమిది అని పేర్కొన్నారు.

9391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS