ఇక నుంచి కాలేజీ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం

Sat,July 28, 2018 04:39 PM

Mid day meals scheme to be applied for all college students in telangana

- ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
- అక్షయపాత్ర ద్వారా అందించడంపై కమిటీలో చర్చ
- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సమావేశమైన మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి
- ఆగస్టు మూడో తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయం

హైదరాబాద్: మరొక బృహత్తర పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంతో దేశం మొత్తంలో తెలంగాణ శభాష్ అనిపించుకుని, ఇప్పుడు ఈ పథకాన్ని కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేయడానికి సిద్దమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్, మోడల్ జూనియర్ కాలేజీలు, బీఈడీ, డీఈడీ కాలేజీల్లోని దాదాపు 5 లక్షల మందికి అందించేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సచివాలయంలోని కడియం శ్రీహరి చాంబర్ లో సమావేశమయ్యారు.

తెలంగాణలోని కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అత్యంత నాణ్యతగా, పౌష్టిక విలువలతో అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు మూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిటీ అడిగింది. 1) ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి కావల్సిన సరుకులన్నీ అందిస్తే సరఫరా చేయడం 2) సరుకులన్నీ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారానే సమకూర్చి భోజనం అందించడం 3) పులిహోర, బ్లాక్ రైస్, ఉప్మా, కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జల వంటి విభిన్న తృణ ధాన్యాలతో కూడిన భోజనాన్ని అందించడంపై ప్రతిపాదనలు ఇవ్వాలని అడిగింది.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో అన్ని కాలేజీలకు మధ్యాహ్న సమయానికి భోజనం అందే విధంగా కావల్సిన కిచెన్లు ఏర్పాటు చేసుకోవాలని, మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవాలని మంత్రులు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు సూచించారు.

అక్షయపాత్ర ఫౌండేషన్ తో పాటు కాలేజీలకు దగ్గరగా ఉన్న మెస్సులు, హోటళ్ల ద్వారా మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించడంపై కూడా చర్చించి, ఈ వివరాలు పూర్తిస్థాయిలో తెప్పించుకుని వచ్చే సమావేశంలో కూలంకుశంగా చర్చించాలని నిర్ణయించారు.

ఆగస్టు మూడో తేదీ మరోసారి సచివాలయంలో ఈ కమిటీ సమావేశం కావాలని, ఈ సమావేశానికి అక్షయపాత్ర ఫౌండేషన్ తగిన ప్రతిపాదనలతో రావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ జాయింట్ డైరెక్టర్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

2766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles