హరించుకుపోతున్న జ్ఞాపకశక్తి

Tue,December 25, 2018 11:50 AM

రాము ఎంబీఏ పూర్తి చేశాడు. వెంటనే ప్రైవేటు కంపెనీలో వద్ద ఉద్యోగానికి కాల్ లెటర్‌ను అందుకున్నాడు. ఎంతో ఆనందంతో ఇంటర్వ్యూకు వెళ్లాడు. మీ బంధువులు, స్నేహితులు ఓ ఐదుగురు సెల్ నెంబర్లను తడుముకోకుండా చెప్పాలని అడిగారు అధికారులు. తన నెంబరు తప్ప మిగిలిన వారి ఫోన్ నెంబర్లు సెల్ మెమొరి కార్డు తీస్తేకాని చెప్పలేని పరిస్థితి రాముది. ఇక అంతే తల గోక్కొవడం రాము వంతయింది. ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఇది ఒక్క రాము పరిస్థితే కాదు. నేడు అందరూ పట్టుమని పది అంకెలు గుర్తి పట్టుకోలేని స్థితికి చేరుకున్నారు.


మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడం శుభపరిణామం. అయితే మోతాదు పెరిగినా, తగ్గినా మూల్యం చెల్లించుకోవడం తప్పదు. సాంకేతిక పరిజ్ఞానం ఎవరికీ అవసరం, ఎంత వరకు అవసరం అనేది గుర్తించి ముందుకు సాగకపోతే తీవ్రపరిణామాలు ఎదురుకోక తప్పదు. ముఖ్యంగా వయస్సుకు తగ్గట్టుగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి. హద్దులు దాటితే గజినీలు గానే చివరి జీవితంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మెదడుకు పదును పెట్టడం మానేసి యాంత్రిక వస్తువులపై ఆధారపడుతున్న పరిస్థితి నేడు సమాజంలో ఉంది. దీంతో మెదడు బండ బారిపోయి ఆలోచనలకు దూరంగా పోతుంది. కనీసం ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్తే వారు అడిగే కనీస ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నేటి యువతది. మారుతున్న జీవనశైలిలో మెదడుకు ఏ మాత్రం పని చెప్పక సాంకేతిక, పరిజ్ఞానంపై పూర్తిగా ఆధారపడిపోవటమే ఇందుకు కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు. యాంత్రిక జీవనం మనిషి జీవనశైలిని పూర్తిగా హరించి వేస్తుంది. ప్రస్తుత కాలంలో వ్యాపారులు సైతం రెండు చిన్న మొత్తాలను కూడటానికీ క్యాలుక్యూలేటర్‌లపై ఆధారపడుతున్నారు. ఇలా చాలా మంది గజిని సినిమాలో హిరో మాదిరిగా ప్రతీ ఐదు నిమిషాలకు జ్ఞాపకశక్తిని కోల్పోయే వారీలా తయారయ్యే అవకాశాలున్నాయని మనోవైజ్ఞానిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లల్లో కొనసాగితే రాబోయే తరం విజ్ఞానం కుచించుకపోయే ప్రమాదం ఉంది.

స్వీయ ఆలోచనలకు తిలోదకాలు


మనం చదివే విషయమైనా, చూసే దృశ్యమైనా, వినే అంశమైనా మెదడులోని స్మృతి పీటికల్లో నిక్షిప్తంగా ఉంటుంది. ముందు తరాల వారంతా స్వతహాగా ఆలోచనలపరులు, మెదడును ఉపయోగించి సమాచారం గ్రహించడమో, నిక్షిప్తం చేసుకోవడమో చేసేవారు. మెదడులోని స్మృతి పీటికల్లో కొన్ని కోట్లాది న్యూరాన్ల శక్తి ఉంటుంది. ఇది కంప్యూటర్‌లో వాడే మెమొరి కార్డు కన్నా ఎన్నో రేట్లు సామర్ధ్యం ఉంటుంది. అలాంటి మెదడుకు పని కలిగించకపోతే మొద్దు బారక తప్పదు మరి. మెదడులోని పదిశాతం వినియోగించుకునే కంప్యూటర్ కన్నా వేగంగా పని చేయగలమని నిపుణులు చెబుతున్నారు. కాని నేటితరం స్మృతి పీటికలను మూడుశాతం వినియోగించడం లేదని, అనేక పరిశోధనల్లో వెల్లడవుతున్న నిజాలు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్లలో నిమగ్నం కావడం జ్ఞాపశక్తికి తగ్గుదలకు కారణం. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే వయస్సు లేని పిల్లలూ స్మార్ట్ ప్రపంచంలో విహరిస్తున్నారు. ఆ లోకంలో ఉన్నంత వరకు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నా.. తమకు తెలియకుండానే మానసిక సమస్యలకు దగ్గర అవుతున్నామనే తెలుసుకోలేకపోతున్నారు. విశ్రాంతి సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో గడపడం పరిపాటిగా మారింది. మానసిక, శారీరక శ్రమతో కూడిన ఆట, పాటలు లేకపోవడం, కనీసం చిత్రలేఖనం అంటే తెలియని పరిస్థితికి వెళ్తున్నారు. తన మేధాశక్తి ఎంటో తమకే తెలియని దుస్థితిలోకి వెళుతున్నారు. ఈ పరిస్థితి కొద్ది సంవత్సరాల వరకు కేవలం నగర, పట్టణాలకే పరిమితమైంది. రోజు రోజుకూ విస్తరిస్తున్న స్మార్ట్ ప్రపంచం నేడు పల్లెకూ పాకింది.

సరైన ఆహారమే మార్గం..


పాఠశాలలకు వెళ్లే మీ పిల్లల జ్ఞాపకశక్తి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా రా..! ఒక వేళ జ్ఞాపక శక్తి అంతంత మాత్రమే అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే వారికి వయస్సు పెరగిన కొద్దీ అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని న్యూట్రీషన్లు హెచ్చరిస్తున్నారు. తీసుకునే ఆహారం ఆరోగ్యానికే కాకుండా మెదడుకు మేలు చేసే అవకాశం ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకొని పిల్లలకు ఇవ్వాలి. ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తి అధికంగా ఉన్న పదార్థాలు క్రమం తప్పకుండా ఇచ్చినట్లయితే తద్వారా ప్రోటీన్లు, క్యాల్షి యం, పొటాషియం తదితర విటమిన్‌లు సమృద్ధిగా దొరికే అవకాశం ఉంది. నేరేడు పండ్లు పిల్లలకు సీజన్‌లో ఇచ్చినట్లయితే జ్ఞాపక శక్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతీ రోజు కొడిగుడ్డును ఉడకబెట్టి పిల్లలకు అందించినట్లయితే జ్ఞాపకశక్తి పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు బాదం, పిస్తావంటి డ్రైప్రూట్స్‌కూరగాయల్లో టమాటా, క్యారెట్, బీన్స్, ఆకు కూరలు వంటివి పిల్లలకు అందించినట్లయితే జ్ఞాపకశక్తి పెంపొందించుకునేందుకు సులభ తరంగా ఉంటుందని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. ప్రధానంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రతీ చిన్న విషయానికి సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడటం తగ్గించుకోవాలి. నడక, యోగా, ధ్యానం, శరీరానికి, మనస్సుకు మంచి విశ్రాంతి, ఏకాగ్రతను పెంపొందిస్తాయి. పిల్లలు పాఠశాల నుంచి వచ్చాక వారు నేర్చుకున్న వాటిని పలకలు, పుస్తకాలపై సాధన చేయించాలి. సృజనాత్మకతను పెంచే చిత్రలేఖనం, క్విజ్ తదితర వాటిల్లో పిల్లలు పాల్గొనేలా చూడాల్సిన అవసరం ఉంది.

జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలివే..


మానసిక వేదన, విరామం లేని పనుల్లో ఒత్తిళ్లకు గురవుతున్నారు. ప్రతీ చిన్న పనికీ సెల్‌ఫోన్లు, క్యాలిక్యూలేటర్లు, కంప్యూటర్లపై ఆధారపడటంతో మెదడుకు పనిలేక జ్ఞాపకశక్తి నశిస్తుంది. నేటి విద్యావిధానం ఈ రకమైన పరిస్థితికే కారణమవుతుంది. ఆధునిక విద్యావిధానం పేరుతో నేటి చిన్నారుల చదువులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎల్‌కేజీ పిల్లవాడిని కంప్యూటర్ ముందు కూర్చొపెట్టి నేర్పుతున్నారు. దీంతో పిల్లల్లో సహజసిద్ధమైన తెలివి తేటలు నశిస్తున్నాయి. విరామం లేకుండా గంటల తరబడి చేసే పని, పగటి పూట, సరైన నిద్రలేక, రాత్రంతా మెలకువగా ఉండి పనులు చేయడం, మద్యం, సిగరెట్టు, గుట్కా వంటి అలవాట్లు, టీవీ ఎక్కువగా చూడటం వంటి చర్యలన్నీ మెదడుపై దుష్పరిణామాలు చూపుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, గంటల తరబడి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతో గడపడమూ జ్ఞాపశక్తి తగ్గడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

2022
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles