పోలీసుల అదుపులో మావోయిస్టు సానుభూతిపరుడు

Thu,November 21, 2019 07:27 PM

లక్ష్మీదేవిపల్లి: మావోయిస్టు పార్టీకి సానుభూతిపరుడైన ఓ వ్యక్తిని గురువారం చుంచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చుంచుపల్లి సీఐ అశోక్ చుంచుపల్లి పీఎస్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని గట్టుమళ్ల అటవీ ప్రాంతంలో ఎస్సై ప్రవీణ్ స్పెషల్ పార్టీ సిబ్బందితో కూంబింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల సమయంలో గట్టుమళ్ల శివారు అటవీ ప్రాంతంలో చేతిలో ఓ వ్యక్తి ఒక సంచిని పట్టుకొని అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులు సదరు వ్యక్తి ఛత్తీస్‌గఢ్ జిల్లా ఉసూర్ కోమటిపల్లికి చెందిన సోడి గంగయ్య అని విచారణలో తెలింది. గంగయ్యా 15 సంవత్సరాల క్రితం గట్టుమళ్ల పంచాయతీ క్రాంతినగర్‌కు వలస వచ్చి ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.


ఎన్డీ చంద్రన్న వర్గం రామన్న దళంతో పరిచయం ఏర్పర్చుకొని, 2012 నుంచి రామన్న అజ్ఞాత దళానికి కావాల్సిన నిత్యావసర వస్తువులను, మందులను వారు కోరిన విధంగా చేరవేస్తున్నాడని వివరించారు. ఈ క్రమంలో గత ఏడాది రామన్న దళం సభ్యులు ఐదుగురు ఆధ్వర్యంలో ఒక రోజు తన ఇంటికి తుపాకులతో వచ్చి వారి వద్ద అదనంగా ఉన్న ఒక తుపాకీని ఇతనికి ఇచ్చి మరలా అవసరం వచ్చినప్పుడు తీసుకుంటామని, అప్పటి వరకు దాచిపెట్టమని చెప్పారు. దానిని బస్తాలో చుట్టి అతని ఇంట్లో దాచిపెట్టాడు. గత కొన్ని రోజులుగా పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ తనిఖీలు చేస్తుండగా భయంతో తన వద్ద ఉన్న తుపాకీని అడవిలో దూరంగా పాతి పెట్టేందుకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చామని ఆయన వివరించారు.

683
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles