దొంగతనం చేస్తాడు..అక్కడే నిద్రపోతాడు..

Thu,October 19, 2017 07:13 AM

Man Thefts than after Sleeps at that House

హైదరాబాద్ : జల్సాలకు అలవాటుపడిన ఓ పాతదొంగ 16 సంవత్సరాల తర్వాత తిరిగి చోరీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడిన సంఘటన గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుధవారం వెలుగు చూసింది. అయితే రాత్రి దొంగతనం చేసిన ఇంటి సమీపంలోనే పడుకొని పొద్దున్నే లేచి జనాలలో కలిసిపోయి తప్పించుకోవడం ఇతడి ప్రత్యేకత. బుధవారం నిందితుడిని పట్టుకున్న గోల్కొండ పోలీసులు 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో డీసీపీ వెంకటేశ్వరరావు, ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్‌మొయినుద్దీన్, గోల్కొండ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్, క్రైం ఎస్‌ఐ వాసుదేవ్‌తో కలిసి వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కల్లూరివారిపాలెంకు చెందిన ముద్ద ఏసు అలియాస్ ఏసోబు (38) 20 సంవత్సరాల క్రితం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత మేస్త్రిగా పనిచేస్తూ జీవిస్తున్న ఇతను జల్సాలకు అలవాటుపడ్డాడు. నాలుగు సంవత్సరాల నుంచి దొంగతనాలు తిరిగి ప్రారంభించాడు.
దొంగతనం చేసిన చోటే నిద్రిస్తాడు..ఏసోబు తాను దొంగతనం చేయాలనుకున్న ఇంటిని ఎంచుకొని రెక్కీ నిర్వహిస్తాడు. తాళాలు వేసి ఉంచిన ఇండ్లను దోచుకొని వాటి పరిసరాలలోనే రాత్రి పడుకుంటాడు. ఉదయాన్నే లేచి జనాలలో కలిసిపోయి తప్పించుకుంటాడు. షేక్‌పేటలో ఉండే సయ్యద్ హసన్ షరీఫ్ ఆగస్టు 24వ తేదీన తన ఇంట్లో దొంగలు పడ్డారని గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విచారణ ప్రారంభించిన గోల్కొండ క్రైం ఎస్‌ఐ వాసుదేవ్, గతంలో దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న వారి వివరాల గురించి ఆరా తీయగా ఏసోబు గురించి సమాచారం అందింది. బుధవారం ఉదయం టోలిచౌకి ప్రాంతంలో తిరుగుతున్న ఇతడిని పట్టుకున్నారు. సుమారు 60తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతను 2015, 16, 17 సంవత్సరాలలో నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో 16 దొంగతనాలు, గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో 2, రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో 3 దొంగతనాలకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తులో ఉంది.

1672
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS