ఆరోగ్యం బాగుచేస్తానని మోసం..ఓ ఇంట్లో నకిలీ బంగారు నాణేలు

Wed,April 17, 2019 09:14 PM


నల్లగొండ : ఓ వ్యక్తి రోగాల నుంచి విముక్తి చేస్తానని నమ్మించి ఓ కుటుంబానికి నకిలీ బంగారం ఇచ్చి మోసం చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం అమరవరం గ్రామంలో వెలుగుచూసింది. అమరవరం గ్రామానికి చెందిన సింగితల గుర్వారెడ్డి ఇంట్లో బంగారం నిధి ఉందని, దాని కోసం కొద్దిరోజులుగా క్షుద్ర పూజలను చేస్తున్నారని గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, సీఐ భాస్కర్‌లు వారి ఇంటిపై ఆదివారం రాత్రి దాడి చేశారు. ఇంట్లో వెతకగా ఇంటిలోని అటక మీద ఉన్న సంచిలో బంగారు నాణేల రంగులో ఉన్న చిన్నచిన్న ముద్దలు దొరికాయి. అవి 24.400 కిలోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


నాణేలను స్వాధీనం చేసుకుని హుజూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ పోలీస్‌ అధికారులు గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీతోపాటు మరికొంత మంది గ్రామస్తులతో కలిసి అది బంగారమో కాదో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించారు. పరీక్షలో ఇత్తడి, రాగితో చేసిన మిశ్రమ పదార్థమని బంగారం కాదని తేలింది.

ఈ విషయమై గుర్వారెడ్డి సోమవారం పోలీస్‌ స్టేషన్‌లో ఓ పత్రాన్ని అందజేశాడు. ‘మా కుటుంబంలో ఆరోగ్యం బాగోలేకపోవడంతో అందరి ఆరోగ్యాలను బాగు చేస్తానని కొత్తగూడెం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాకు పరిచయమయ్యాడు. మొదట పూజలు చేసి కొద్దిమేర డబ్బు తీసుకుని పోయేవాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతిసారి రూ. 20 వేలు తీసుకుని బంగారు నాణేలంటూ కొన్ని ఇచ్చి వెళ్లేవాడు. వాటిని కొద్దిరోజుల వరకు తీయొద్దని చెప్పేవాడు. ఇలా మా దగ్గరి నుంచి రూ.2 లక్షలు తీసుకున్నాడు. పూజలు చేసిన తర్వాత వాటిని తీయాలని చెప్పడంతో వాటిని అలాగే ఉంచాం’ అని గుర్వారెడ్డి చెప్పాడు. కొత్తగూడెం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు? రోగాలు బాగు చేయడానికి వచ్చాడా? నకిలీ బంగారం అంటగట్టి మోసం చేయడానికి వచ్చాడా..? అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వీలైనంత త్వరగా కేసు వివరాలు బయటపెడతామని సీఐ భాస్కర్‌ తెలిపారు.

3183
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles