సూర్యాపేట జిల్లాలో వ్యక్తి దారుణ హత్య..

Sun,June 2, 2019 10:51 PM

man brutally murdered in suryapet district today

- పాత కక్షలే కారణం అంటున్న గ్రామస్తులు, పోలీసులు
సూర్యాపేట: జిల్లాలోని పెన్‌పహాడ్ మండలం అన్నారం గ్రామానికి చెందిన సీపీఎం గ్రామ కార్యదర్శి నకిరెకంటి వెంకటేశ్వర్లు(27)ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాపు కాసి హతమార్చారు. ఈ సంఘటన మండల పరిధిలోని నాగులపాటి అన్నారం బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. అన్నారం గ్రామానికి చెందిన నకిరెకంటి వెంకటేశ్వర్లు (27) గత సంవత్సరం మార్చి 3న గ్రామ పంచాయతీ నడిబొడ్డున అందరూ చూస్తుండగానే మారుణాయుధాలతో తన పాలివాడు నకిరెకంటి రమేష్‌ను విచక్షణారహితంగా వెంటాడి హత్య చేశాడు.

ఆ సమయంలో గ్రామం ఒక్కసారిగా ఉలికిపడింది. వెంకటేశ్వర్లు రమేష్‌ను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. ఆనాటి నుంచి హైదరాబాద్ లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గ్రామంలో శుభకార్యక్రమాలకు వస్తూ వెళ్తున్నాడు. ఇవాళ కూడా పొలం వద్ద తన బంధువులకు సంబంధించిన పండుగకు వెళ్లి తిరిగి బైకుపై వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మాటువేసి హత్యచేశారు. దుండగులు కత్తిపీటతో వచ్చి వెంకటేశ్వర్లును కసితీరా హత్య చేశారు. కణతల పైభాగం, తలపై, పొట్టపై కత్తి పోట్లు పొడిచి పరారయ్యారు. హత్య చేసిన దుండగులు నారాయణగూడెం, నాగులపహాడ్ మీదుగా వెళ్లారు.

నాగులపహాడ్ నీటి బొందం వద్ద తమ వెంట తెచ్చుకున్న కత్తిపీటను విసిరివేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ వెంకటేశ్వరరెడ్డి, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. కాగా డీఎస్పీ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. వెంకటేశ్వర్లు గతంలో తన సమీప బంధువు రమేష్‌ను హత్య చేశాడని, రమేష్‌కు సంబంధించిన వారే ప్రతీకారం తీసుకున్నట్లు భావిస్తున్నామని తెలిపారు.

3285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles