‘మా భూమి’కి 35 ఏళ్లు

Sun,March 22, 2015 10:29 AM

Maa Bhumi Ki 35 Years

Maa Bhumi Ki 35 Years

పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా
పాలు మరచి ఎన్నాల్లయ్యిందో
ఓ... పాల బుగ్గల జీతగాడా
కొలువు కుదిరి ఎన్నాల్లయ్యిందో....
సంధ్య గొంతులో ఆర్ధ్రంగా వినిపించిన ఈ గీతం ఎన్ని హృదయాల్ని కదిలించిందో? ఎన్ని గుండె తంత్రుల్ని మీటిందో? అవును.. మూడున్నర దశాబ్దాలు గడిచినా నేటికీ తెలంగాణ ప్రజల నాలుకలపై ఆడుతున్న గీతం. మళ్లీ మళ్లీ మననం చేసుకుంటున్న గీతం. చరిత్రను పాఠంగా స్వీకరించే సమాజం ముందు నిరంతర కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్న గీతం. నిజంగా తలుచుకుంటే దుఃఖం వచ్చేను. ముప్పైఐదేళ్ల క్రితం తెలుగు ప్రజల ముంగిట వెండి తెర రెక్కలు కట్టుకు వాలిన గీతం... తెలంగాణ జీవితాన్ని తెరపై చూపించిన చిత్రం మాభూమి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని తెరకెక్కించిన ఈ చిత్రం దశాబ్ధాలు గడిచినా నేటికీ ప్రజల జ్ఞాపకాల నుంచి, జీవితాల నుంచి మాత్రం తప్పుకోలేదు. అందుకే మళ్లీ మళ్లీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. మాభూమి చిత్రం 35 పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలు ఒక్క సారి మననం చేసుకుందాం..

Maa Bhumi Ki 35 Years

తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి మా భూమి చిత్రం. తెలంగాణలో భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని మూడు దశాబ్దాల క్రితం మా భూమి పేరిట తెరకెక్కించారు బి. నర్సింగరావు, రవీంద్రనాథ్. తెలుగు సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన ఈ చిత్రం అప్పట్లో పలు నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. 1980 మార్చి 23న విడుదలై బెంగుళూరు, కైరో, సిడ్నీ వంటి పలు జాతీయ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడిన ఈ చిత్రం ముప్పై ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్న నేపథ్యంలో తెలంగాణ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన పోరాట గాథను మరో మారు గుర్తు చేసుకోవల్సిన అవసరం ఉంది.

జబ్ కేత్ జాగే


ఉర్దూ రచయిత కిషన్ చందర్ రాసిన జబ్ కేత్ జాగే నవల ఆధారంగా మాభూమి చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ ప్రాంతం లోని భూసామ్య దోపిడీ, రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా నడిచిన రైతాంగ పోరాటాన్ని, మిలిటరీ యాక్షన్ వంటి సంఘటల్ని ఈ చిత్రం కోసం దృశ్యమానం చేశారు. ప్రముఖ కళాకారుడు బి.నర్సింగరావు నిర్మించిన ఈ చిత్రానికి బెంగాలీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ గౌతంఘోష్ దర్శకత్వం వహించారు. నల్లగొండ జిల్లాలోని సిరిపురం గ్రామంలో నడిచే కథ తెలంగాణలో భూస్వామ్య దోపిడీని, జమీందార్ల పెత్తనాన్ని కళ్లకు కట్టింది. గ్రామంలోని పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌కి చేరుకున్న రామయ్యకు కమ్యూనిస్టు ఉద్యమం పరిచయం అవడం, తిరిగి అదే ప్రాంతానికి వచ్చి భూస్వాములకు వ్యతిరేకంగా ఎలా ప్రజా ఉద్యమాన్ని నిర్మించాడనేది కథలో చూడవచ్చు. నాటి పరిస్థితుల్ని వాస్తవానికి దగ్గర చూపించేందుకు దర్శక నిర్మాతలు స్క్రిప్ట్ మీద చాలా కృషి చేశారు. చరిత్రను వెలికితీయడానికి చాలా కృషి చేశారు.

ప్రజా సాహిత్యం


గౌతం ఘోష్ సహచరి సైతం ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజై నర్‌గా పనిచేసింది. ఈ సినిమా ద్వారా నాటక రంగానికి చెందిన సాయిచంద్, తెలంగాణ శకుంతల, కాకరాల వంటి పలువురు కళాకారులను వెండి తెరకు పరిచయం చేశారు నర్సింగరావు. అంతే కాదు.. గ్రామాల నుంచి సాధారణ జనాన్ని చిత్రంలో పాత్రధారుల్ని చేశారు. ప్రముఖ సాహితీవేత్త త్రిపురనేని గోపిచంద్ తనయుడు సాయిచంద్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. 1978 జూలైలో ప్రారంభమైన చిత్రం 80లో షూటింగ్ పూర్తి చేసుకుంది. కథతో పాటు అప్పటికే బహుళ ప్రజాదరణ పొందిన ప్రజా సాహిత్యం చిత్రానికి అదనపు ఆకర్షణగా మారింది. సుద్దాల హన్మంతు రాసిన పల్లెటూరి పిల్లగాడా..పసులగాసే పోరగాడా, బండి యాదగిరి రాసిన బండెనక బండి గట్టి పాటలు విస్తృతంగా ప్రజలకు చేరువయ్యాయి. జననాట్య మండలి ద్వారా ప్రజా కళాకారులుగా ఆదరణ గల గద్దర్, సంధ్య ఈ చిత్రంలో పాడిన పాటలు లక్షలాది మందిని ఉర్రూతలూగించాయి. షూటింగ్ పూర్తయినా ఈ చిత్రం సమయానికి విడుదల కాకపోవడంతో నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఎట్టకేలకు 1980 మార్చి 23న చిత్రం విడుదలైంది. తెలుగు సినిమా చరిత్రలో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన ఈ చిత్రం పలు అవార్డులను సొంతం చేసుకోవడమే కాక విశేష ప్రజాదరణ పొందింది. తెలంగాణ ప్రజల జీవనాన్ని, పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ఇవాల్టికీ నిజంగా ఓ చరిత్ర.

నేడు ప్రదర్శన


మా భూమి చిత్రం 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సాయంత్రం 5.30లకు లా మకాన్‌లో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

4449
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS