ఫలించిన ప్రేమ పోరాటం

Tue,April 23, 2019 10:41 PM

Lovers get married

జమ్మికుంట రూరల్‌: ప్రేమ పేరిట మోసపోయిన తనకు న్యాయం కావాలంటూ ఓ యువతి చేపట్టిన పోరాటం ఫలించింది. ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన ఆమెకు పోలీసుల చొరవతో ఆలయంలో వివాహం జరిగింది. జమ్మికుంట మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలు.. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన చర్లవంచ సుమలత (19) ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నది. ఈ క్రమంలో మాచనపల్లి అనుబంధ గ్రామం ఎడ్లపల్లికి చెందిన గుర్రాల రాజు అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమించానని నమ్మించాడు. పెండ్లి చేసుకుంటానని మోసగించాడు. తర్వాత ముఖం చాటేయడంతో సదరు యువతి మంగళవారం రాజు ఇంటి ఎదుట బైఠాయించింది.

యువతి ఆందోళనతో దిగివచ్చిన ప్రియుడి కుటుంబం

సుమలతకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా నాయకురాలు ఐల ప్రసన్న, సామనపల్లి లక్ష్మి, గజ్జెల సరిత మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న జమ్మికుంట పట్టణ సీఐ సృజన్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి చేరుకొని తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సుమలత ఆందోళన విరమించింది. తన తల్లిదండ్రులు సారయ్య, సరోజనతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అనంతరం పోలీసులు గుర్రాల రాజుతోపాటు అతని తల్లిదండ్రులు సమ్మిరెడ్డి, సునీతను ఠాణాకు పిలిపించారు. మాచనపల్లి సర్పంచ్‌ తిరుపతిరెడ్డి సమక్షంలో సీఐ సృజన్‌రెడ్డి వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అందరి అంగీకారంతో పోలీస్‌ స్టేషన్‌ పక్కనే ఉన్న శ్రీరామాలయంలో రాజు, సుమలత వివాహం జరిపించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌, రెండు కుటుంబాల సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

2707
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles