ఇష్టాలను కాదంటే ద్వేషం పెంచుకుంటున్నారు

Thu,July 20, 2017 07:30 AM

Liberal Parenting

నేను హీరోయిన్ అవుతా. ఇంట్లో ఉంటే చదువు.. చదువు అని అమ్మానాన్నలు ఇబ్బంది పెడుతున్నారని ఓ విద్యార్థిని ఇంటి నుంచి పారిపోయింది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి.. తాను క్రికెటర్ కావాలనుకుంటున్నానని ఇంట్లో నుంచి వెళ్లిపోగా, నాలుగునెలల తర్వాత నగరంలోని రైల్వే ఫ్లాట్‌ఫారమ్‌పై చిరిగిన బట్టలతో దొరికాడు. చిన్నారులు విపరీత ధోరణులతో ఇంట్లోనుంచి వెళ్లిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

తాజాగా మియాపూర్‌కు చెందిన పూర్ణిమసాయి కూడా ఇవే కారణాలతో ఇంట్లోంచి వెళ్లి ముంబయిలో ప్రత్యక్షమయింది. ఓ సీరియల్ నటిని చూసి, ఆమెలా ఎదగాలనే కోరికతో వెళ్లిపోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడయింది. తల్లిదండ్రులు పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలని, వారినీ మాట్లాడిస్తే ఇలాంటి పోకడలను ముందే ఆపేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవికత నుంచి బయటపడి కోరుకున్న స్థాయికి వెళ్లాలనే కోరికతో ఇంట్లోంచి పారిపోతున్న వారి సంఖ్య కొన్నేండ్లుగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశం.

ఇలాంటివి ఇప్పుడు కొత్తేం కాదు. 90వ దశకంలో బుల్లితెరపై శక్తిమాన్ ధారావాహికను చూసిన పిల్లల్లో కొంతమంది తాము కూడా శక్తిమాన్ అయిపోతామంటూ భవనాలపై నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.

వాస్తవికతలోని కఠినత్వాన్ని తట్టుకోలేక..
12 నుంచి 16 ఏండ్ల వారిలోనే ఇటువంటి ధోరణులు అధికంగా ఉంటాయని మానసిక నిపుణులు చెప్తున్నారు. వాస్తవిక జీవితంలో కఠినమైన విషయాలను ఎదుర్కొనేదానికన్నా ఊహాజనిత ప్రపంచంలోని సుఖాలను, పేరు ప్రఖ్యాతులను దక్కించుకోవడం మేలని వారు భావిస్తుంటారు. ఈ స్థితి ఉన్నవారు కంప్యూటర్ గేమ్స్ ఇతర పద్ధతుల్లో ఆనందాన్ని వెతుకుతుంటారు. రోజూ స్కూలుకు వెళ్లడం, తల్లిదండ్రులు, టీచర్ల చేత చీవాట్లు తినడం కంటే నచ్చినట్టు జీవించే స్వేచ్ఛ దొరుకుతుందనే ఆలోచనలతో బాహ్య ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లపై అవగాహన లేక పిల్లలు ఇంట్లోంచి వెళ్లిపోతుంటారు.

చదువు తప్ప విద్యార్థులకు మరోవ్యాపకం లేకుండా చేసేలా ప్రస్తుతం విద్యావ్యవస్థ ఉన్నదని, దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని మానసిక నిపుణులు అంటున్నారు. ఎప్పుడూ మార్కులు, ర్యాంకులు అని పిల్లలపై భారంవేసే తల్లిదండ్రులు, టీచర్ల వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరిగిపోతున్నది. పిల్లలు చదువు కాకుండా వేరేఅంశంపై ఆసక్తిచూపితే.. తల్లిదండ్రులు వారిని వారిస్తున్నారు. పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాలను గుర్తించాలంటే వారితో మాట్లాడాలని, ప్రేమతో సముదాయించాలని సూచిస్తున్నారు.

లిబరల్ పేరెంటింగ్‌ను అలవర్చుకోవాలి
పిల్లలను దండించడం ద్వారానే దారికి తీసుకురావచ్చని భావించడంతోనే వారు మొండిగా ప్రవర్తిస్తూ ఇంట్లోంచి వెళ్లిపోవడం చేస్తుంటారు. అథారిటివ్ పేరెంటింగ్ ద్వారా పిల్లల్లో భయం ఏర్పడుతుంది. మనసులో ఉన్న ఆలోచనలను బయటపెడితే తల్లిదండ్రులు ఏమంటారో అనే భయంతో ఉన్న పిల్లలు ఇంట్లోంచి వెళ్లిపోవడం, ఇతర నిర్ణయాలు తీసుకుంటారు. లిబరల్ పేరెంటింగ్ విధానాన్ని అలవర్చుకోవాలి. డబ్బు సంపాదించడం ఎంత కష్టమైనదో ఉదాహరణలతో వివరించాలి. సినిమా స్టార్లు, క్రీడాకారులు జీవితాల్లో ఎదుర్కొన్న కష్టనష్టాలను తెలియజేయాలి. అప్పటికీ వినకపోతే మానసిక నిపుణుల సాయం తీసుకుని కౌన్సెలింగ్ చేయించాలి.
- డాక్టర్, పూర్ణిమా నాగరాజు (సైకాలజిస్టు)

828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS