లక్ష్మీపూర్ తండా పంచాయతి సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం

Wed,January 2, 2019 10:30 PM

రాజన్న సిరిసిల్ల: తండాలను పంచాయతీలుగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వరంతో తమవంతుగా ఐక్యతతో తొలి లక్ష్మీపూర్ తండా పంచాయతీని వారు బుధవారం ఏకగ్రీవం చేసుకున్నారు. గ్రామ స్వరాజ్యమే దేశానికి పట్టు కొమ్మలు అనే నానుడితో తండాల అభివృద్ధికి ఏకగ్రీవమే తారక మంత్రంగా నిర్ణయించుకున్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి లక్ష్మీపూర్ తండా పంచాయతీ ఏకగ్రీవంగా చేసుకుని సర్కారుకు తమ కానుకగా ఇచ్చారు. దీంతో తండావాసులు స్వీట్లు పంచిపెట్టుకుని సంబురాలు జరుపుకున్నారు.


గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్ గ్రామపంచాయతీ పరిధి 10 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీపూర్ తండా ఉంది. ఆ తండాను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త గ్రామపంచాయతీగా ప్రకటించారు. కాగా సీమాంధ్ర ప్రభుత్వాల పరిపాలనలో తండావాసులు ఓటు వేసేందుకు 10 కిమీ దూరం ప్రయాణించాల్సి వచ్చేది. తమ వీధి సమస్యలను పరిష్కరించాలని రోజూ అక్కడికి వెళ్లి చెప్పుకోవాల్సి వచ్చేది. ఈ కష్టాలను దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం లక్ష్మీపూర్ తండాను.. కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది.

510 జనాభా గల ఈ తండాలో 236 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో తండావాసులు 108 మంది పురుషులు, 120 మంది స్త్రీలు, 8 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఏర్పాటుతో సంబురాలు చేసుకున్న తండావాసులు అదే దిశలో తండాబివృద్ధికి ఏకగ్రీవ మార్గమే శ్రీరామ రక్ష అనుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడిన రెండో రోజు తమ నిర్ణయాన్ని ప్రకటించారు.

తండా వాసులు సర్పంచ్, ఉపసర్పంచ్, 6 వార్డు సభ్యుల స్థానాలకు ఏకగ్రీవం చేసుకుని ఆందరికీ అదర్శంగా తమ ఐక్యత చాటారు. సర్పంచ్‌గా లకావత్ మంజుల, ఉపసర్పంచ్‌గా భూక్య రమేశ్, వార్డు సభ్యులుగా తేజావత్ మోహన్, లకావత్ రాజ్యానాయక్, బానోతు సరిత, తేజావత్ వనిత, భూక్య లక్ష్మిని ఎన్నుకుంటునట్లు ప్రకటించారు.

లక్ష్మీపూర్ తండా పంచాయతీలో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో తండావాసులు అడుగు ముందుకు వేశారు. కొత్త గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచిపెట్టుకుని సంబురాలు జరుపుకున్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు సహకారంతో లక్ష్మీపూర్ తండాను జిల్లాలో ఆదర్శంగా అభివృద్ధి చేసుకుంటామని తండావాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లింగన్నగారి దయాకర్‌రావు, సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్‌యాదవ్, నేతలు కమ్మరి రాజారాం, బానోతు గోపీనాయక్, తండావాసులు ఉన్నారు.

3064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles