గ్రామాభివృద్ధికి భూవిరాళాలు

Sun,September 22, 2019 08:51 AM

హైదరాబాద్: ప్రగతి ప్రణాళిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. 16వ రోజు శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరిగాయి. జనమంతా ఒక్కటై శ్రమదానం కార్యక్రమాలతో తమ గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం గ్రామాలకు వెళ్లి ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. తమకు జన్మనిచ్చిన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పలువురు నగదు సాయం అందించగా.. మరికొందరు డంపింగ్‌యార్డులు, శ్మశానవాటిక ఏర్పాటుకు భూములను విరాళమిచ్చారు.
మొగుళ్లపల్లి: డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల ఏర్పాటు కోసం వేర్వేరు జిల్లాల్లో గ్రామస్థులు భూమి విరాళమిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం గణేశ్‌పల్లికి చెందిన అన్నదమ్ములు లాండిగే సమ్మయ్య, ఆగయ్య, యాదగిరి గ్రామంలో డంపింగ్‌యార్డు కోసం శనివారం 5 గుంటల వ్యవసాయ భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు భూమికి సంబంధించిన పత్రాలను సర్పంచ్ తిప్పారపు యుగేంధర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, ప్రజలు దాతలను అభినందించారు.
తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన అన్నదమ్ములు పులి వెంకటనర్సయ్య, పుల్లయ్య తమ తండ్రి జ్ఞాపకార్థం శ్మశానవాటిక ఏర్పాటుకు గ్రామంలో 20 గుంటల స్థలం విరాళమిచ్చారు. ఇందుకు సంబంధించిన భూపత్రాలను సర్పంచ్ మమతకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీదేవి దాతలను అభినందించారు.
కారేపల్లి రూరల్: ఖమ్మం జిల్లా కారేపల్లి రూరల్ మండలంలోని గుట్టకిందిగుంపు, చిన్నమడెంపల్లి, సీతారాంపురం గ్రామా ల్లో శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు కోటమైసమ్మ దేవస్థానం చైర్మన్ పర్సా పట్టాభిరామారావు శనివారం మూడెకరాల భూమిని విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన భూపత్రాలను ఆ గ్రామాల సర్పంచులకు అందజేశారు.

359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles