టీఆర్‌ఎస్ మీద పోటీ అంటే.. పోచమ్మగుడి ముందు మేకను కట్టేసినట్టే: కేటీఆర్

Fri,November 16, 2018 08:11 PM

kodad tdp leader joins in trs party in the presence of minister ktr

హైదరాబాద్: టీఆర్‌ఎస్ మీద పోటీ చేయడమంటే.. పోచమ్మ గుడి ముందు మేకను కట్టేసినట్టేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ గట్టు మీద సంక్షోభం ఉంది.. ఈ గట్టు మీద సంక్షేమం ఉందన్న మంత్రి... కరెంటు అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్ కావాలో... అడగకుండానే కడుపు నిండా కరెంటు ఇచ్చిన టీఆర్‌ఎస్ వెంట ఉంటారో తేల్చుకోవాలని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కోదాడ టీడీపీ నేత బొల్లం మల్లయ్య యాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

"కోదాడ యువశక్తిని వెంట పెట్టుకొని వచ్చిన మల్లయ్య యాదవ్‌కు స్వాగతం. కోదాడలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. గాంధీభవన్‌కు తాళం వేసి బౌన్సర్లను కాపలా పెట్టే పరిస్థితి వచ్చింది. 75 రోజుల్లో కనీసం సీట్లు కూడా పంచుకోలేకపోయారు. సీట్లు కూడా పంచుకోలేని అసమర్థులు రేపు ఎలా పాలిస్తారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ కాంగ్రెస్ పెద్దమనిషి టికెటు కావాలంటే రూ.3 కోట్లు అడిగాడు. ఓయూ విద్యార్థి టికెట్ ఇవ్వమంటే పైసలు ఎన్ని ఉన్నాయి అని ఢిల్లీ నాయకులు అడిగారు. తెలంగాణ పోరాటమే అస్తిత్వం కోసం జరిగింది. ఇక్కడ పుట్టిన భూమి పుత్రులే ఈ నేలను పాలించాలి. కాంగ్రెస్ నుంచి టికెట్ కావాలంటే ఢిల్లీకైనా వెళ్లాలి. లేదంటే అమరావతికైనా పోవాలి. అధికారుల విభజన చేయకుండా ప్రధాని మోదీ ఏడు నెలలు సతాయించారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసుకున్నాం. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు, రైతుబంధు, రైతుబీమాతో వ్యవసాయాన్ని పండుగ చేశాం. కాంగ్రెస్‌లో 40 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌లో సీఎం ఎవరన్నది ఢిల్లీలో డిసైడ్ అవుతుంది. సీల్డ్ కవర్ సీఎం కావాలా.. సింహం లాంటి సీఎం కావాలో తేల్చుకోండి. కాంగ్రెస్ వాళ్లలాగా మేం దరిద్రపుగొట్టు పనులు చేయలేదు. ఆడబిడ్డల సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టినం. ఆ యుద్ధంలో ఇంకా 25 రోజుల సమయమే ఉంది. కలిసి కొట్లాడితే ప్రత్యర్థి ఎవరైనా దిమ్మ దిరిగిపోవాల్సిందే. కోదాడలో మనం దెబ్బ తినొద్దంటే సొంత ఎజెండాలు పక్కన పెట్టాలి. కలిసికట్టుగా కదం తొక్కితే కోదాడ మీద గులాబీ జెండా ఎగురుతుంది.." అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. నీలాంటి నాయకుడికి అన్యాయం జరగొద్దని సీఎం కేసీఆర్ నన్ను ఆదరించారు. నన్ను ఆదరించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా. ప్రజా ప్రతినిధిగా పది మందికి ఉపయోగపడాలనే నేను రాజకీయాల్లోకి వచ్చా. బొల్లం మల్లయ్య యాదవ్

3224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles