కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి..రాజకీయ ప్రస్థానం

Thu,May 30, 2019 08:46 PM

kishanreddy swearing in as union minister


హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్రమోదీ మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఇవాళ రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్తానం వివరాలిలా ఉన్నాయి.

భారతీయ జనతా పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జి. కిషన్‌ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. హిమాయత్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఒకసారి, అంబర్‌పేట ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు గెలిచిన కిషన్‌ రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండే కిషన్‌ రెడ్డి.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌పై 62,114 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తానికి పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్న కిషన్‌ రెడ్డికి కేంద్రమంత్రి పదవి వరించింది. ఒక సామాన్య కార్యకర్తగా తన పయనాన్ని ప్రారంభించిన కిషన్‌ రెడ్డి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ఫ్లోర్‌ లీడర్‌గా పని చేసి.. ఇవాళ కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

గంగాపురం కిషన్‌ రెడ్డి 1964, మే 15న రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్‌లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు స్వామిరెడ్డి, అండాలమ్మ. సీఐటీడీ నుంచి టూల్‌ డిజైన్‌లో డిప్లొమా చేశారు కిషన్‌ రెడ్డి. 1995లో కావ్యతో కిషన్‌ రెడ్డికి పెళ్లి అయింది. వీరికి ఇద్దరు సంతానం.. వైష్ణవి, తన్మయ్‌.

1977లో జనతా పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు కిషన్‌ రెడ్డి. 1980లో భారతీయ జనతా పార్టీలో చేరి.. అప్పట్నుంచి పార్టీకి సేవలందిస్తూనే ఉన్నారు. 1980లోనే రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్‌ పదవి చేపట్టారు.1983లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్ష పదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2002 నుంచి 2005 మధ్యకాలంలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు. 2004లో హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

6898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles