కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం

Fri,May 24, 2019 11:33 PM

khammam mp nama nageswarrao press meet

కార్యకర్తల కష్ట ఫలితమే నా విజయం
సీతారామా ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా పని చేస్తా
విలేకరుల సమావేశంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు

ఖమ్మం: పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది చేయడమే తన కర్తవ్యమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని టీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నామా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని, తనకు పార్టీ ముఖ్యమన్నారు. పార్టీ విధానాలను అమలు చేయడం, అధినేత చెప్పింది చేయడమే తాను నేర్చుకున్నానన్నారు.

ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, ఇది తన ఒక్కడి గెలుపు కాదని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల గెలుపు అని నామా నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం ప్రజలు చరిత్రను తిరగరాశారన్నారు. ఖమ్మం చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరికీ రాని మెజారిటీని తనకు ఇచ్చారన్నారు.

పార్టీలకు అతీతంగా లక్షా 68 వేల ఓట్ల మెజార్టీని ప్రజలందించారన్నారు. తన గెలుపు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని జిల్లా ప్రజలే బలపరిచారని, సీఎం కేసీఆర్‌కు ఖమ్మం ఎంపీ సీటు కానుకగా ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని స్థాయిల నాయకులతో అన్నదమ్ములా కలిసి నడుస్తానన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఖమ్మం వైపు చూశారని, ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ గెలవడం కష్టంగా ఉందని అనేక మంది పేర్కొన్నారని, అయినప్పటికీ కేసీఆర్ నిర్ణయాన్ని ఆమోదించడం గర్వంగా ఉందన్నారు.

అందరి వాడిగా ఉంటానని, అందరితో వారి కుటుంబ సభ్యులుగా ఉంటూ కేసీఆర్ నాయకత్వంలో ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్దికి కృషిచేస్తానన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసేలా కృషి చేస్తానన్నారు.

2623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles