కేసీఆరే మళ్లీ సీఎం..: అసదుద్దీన్ ఓవైసీ

Thu,September 20, 2018 05:38 PM

KCR will become CM again Telangana says Hyderabad MP Asaduddhin Owaisi

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి టీఆరెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎంఐఎం పోటీ చేయని స్థానాల్లో టీఆరెస్‌కే తమ మద్దతు ఉండే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఎంఐఎం ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. వాళ్లంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలే. 2014లో 20 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేసింది. ఈసారి ఏడు కాకుండా ఇంకా ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో తర్వాత నిర్ణయిస్తామని పీటీఐతో మాట్లాడుతూ అసద్ అన్నారు. టీఆరెసే మళ్లీ అధికారంలోకి వస్తుందని నేను భావిస్తున్నా. కేసీఆరే మళ్లీ సీఎం అవుతారు. దేశంలోనే తెలంగాణ వృద్ధిరేటు అత్యుత్తమంగా ఉంది అని అసద్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన షాదీ ముబారక్ పథకం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి పథకాలన్నీ నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే టీఆరెసే మళ్లీ గెలుస్తుందని నేను చెప్పగలను అని ఓవైసీ స్పష్టంచేశారు.

నాలుగేళ్లుగా తెలంగాణలో ఎలాంటి మత హింస చోటు చేసుకోలేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తాము పోటీ చేయని స్థానాల్లో ఎవరికి ఓటేయాలో ప్రజలే తేల్చుకుంటారని, మనం చెప్పాల్సిన పనిలేదని ఓవైసీ చెప్పారు. తెలంగాణలో ఏమాత్రం ఆందోళన కలిగించే వాతావరణం లేదని, అదే కేసీఆర్‌కు సాయం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఇక కర్ణాటకలో కుమారస్వామి సీఎం కాగా లేనిది.. తెలంగాణలో ఎంఐఎం ఎందుకు ఆ స్థానాన్ని ఆశించకూడదన్న తన సోదరుడు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కూడా అసద్ స్పందించారు. అక్బర్ ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భం వేరని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాతో వచ్చిన సమస్యే అది. వాళ్లకు కావాల్సినవి మాత్రమే చూపిస్తారు. అక్బర్ ఆ వ్యాఖ్యలకు ముందు, తర్వాత ఏమన్నారో చూపెట్టలేదు అని అసద్ చెప్పారు.

5216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles