తెలంగాణ భాషను కాపాడుకోవాలి : ఎంపీ కవిత

Sat,August 12, 2017 10:06 PM

kavithanjali kavi sammelanam by telangana jagruthi

నిజామాబాద్ : జాగృతి కవితాంజలి శీర్షికన తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణలో 31 జిల్లాల్లో నిర్వహిస్తున్న కవి సమ్మేళనాల్లో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్‌లో కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత హాజరై మాట్లాడారు.

తెలంగాణలో కవులే లేరన్న సమయంలోనే అప్పటి గోల్కొండ పత్రిక సంపాదకులు, ప్రముఖ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి యావత్తు తెలంగాణ అంతా సంచరించి 300ల పైచిలుకు కవులు, కవయిత్రులతో కూడిన గోల్కొండ కవుల ప్రత్యేక సంచికను వెలువరించి ఆంధ్రాపాలకులను విస్మయానికి గురిచేశారని గుర్తు చేశారు. అలాంటి సురవరం ప్రతాపరెడ్డిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ జాగృతి ప్రతి ఇంటిని, గడప గడపనూ ఉన్న కవులను, కవయిత్రులను సేకరించి ఎంపిక చేయబడిన కవుల కవిత్వాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక సంచికను త్వరలోనే తీసుకురానున్నామని తెలిపారు.

తెలంగాణా భాష అంతరించిపోతున్న సందర్బంలో మనమంతా కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ కవిత.తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యతను ఇచ్చి, ప్రపంచ తెలుగు మహాసభల్లో నిజామాబాద్ జిల్లాలోని కవులు, కవయిత్రులను తెలుగు పండితులందరినీ గుర్తించి ఘనంగా సన్మానిస్తామన్నారు. పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ కవి సమ్మేళనాలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యే అవకాశం ఉందని, దానిని గిన్నిస్ బుక్‌లో ఎక్కేలా కృషిచేస్తామని ఎంపీ కవిత అన్నారు.

అక్టోబర్‌లో నిర్వహించే ప్రపంచ తెలుగు తెలుగు మహాసభలో నిజామాబాద్(ఇందూరు)జిల్లాకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తామన్నారు. తెలంగాణ కవులు, రచయితల రచనలు కనుమరుగు కాకుండా రాబోయే తరాలకు అందించేందుకు కృషిచేస్తామన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతితో ప్రారంభమైన కవితాంజలి కవి సమ్మేళనం.. పద్మభూషణ్, డాక్టర్ కాళోజీ నారాయణరావు జయంతిన హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించే కవి సమ్మేళనంతో ముగుస్తుందని తెలిపారు.

2213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles