అన్యాయంపై ధిక్కారస్వరం కాళోజీ

Mon,November 13, 2017 10:14 AM

యాదాద్రి భువనగిరి : పుట్టుకనేది చావునేది బతుకంతా తెలంగాణది అని ప్రకటించి తన జీవితమంతా తెలంగాణ కోసం అంకితం చేసిన మహనీయుడు కాళోజీ. మనిషి జీవిత కాలంలో కలాన్ని... గళాన్ని ఒకేవాడితో ఉపయోగించి రచనల్లోనూ, ఆచరణల్లోనూ ఒకే నిశిత వైఖరితో పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. కాళోజీ నారాయణరావు 1914 వరంగల్ జిల్లా మణికొండలో సెప్టెంబర్ 9న జన్మించారు. మడికొండలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి వరంగల్, హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. పుట్టుక నీది.. చావు నీది..బతుకంతా దేశానిది లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ గురించి కాళోజీ రాసిన ఈ పంక్తులు ఆయన జీవితానికి వర్తిస్తాయి.


తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. అన్యాయాన్ని ఎదురించినోడు నాకు ఆరాధ్యుడు...అన్యాయం అంతరిస్తే..నా గొడవకు ముక్తిప్రాప్తి..అన్యాయాన్ని ఎదురిస్తే నా గొడవకు సంతృప్తి.. అని సగర్వంగ ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి. నైజాం రాజ్యంలో నిజాం రాజు అనుసరించిన ద్వంద్వ నీతి, దమన వైఖరి, అరాచక పాలనను ఆనాటి దేశ్‌ముఖ్‌లు, పటేన్లు, పట్వారీలు, ప్రజాకారులు, ప్రజలపై చేసే దౌర్జన్యాలను తీవ్రంగా ప్రతిఘటించి ప్రశ్నించిన గొప్ప వ్యక్తి.

అన్నపు రాసులు ఒకచోట - ఆకలి మంటలు ఒకచోట
కమ్మని చకిలాలొక చోట -గడ్డి దౌడలింకొక చోట
పెత్తనమంతా ఒకచోట - సత్తువంతా ఒకచోట
అనుభవమంతా ఒకచోట -అధికారమంతా ఒకచోట
ఇలా సమాజంలోని వైరుధ్యాలను నిశితంగా పరిశీలించి ఒక తాత్వకుడిలా అక్షరబద్ధం చేశాడు. మార్క్స్ సమాజాన్ని పాలకులు, పాలితుల సంఘర్షణను చిత్రీకరిస్తే కాళోజీ సమాజమంతా చతుర మతులు, దెబెమొగాలు అనే రెండు వర్గాలుగా సంఘర్షణ నడుస్తున్నదన్నారు. అన్యాయం అక్రమాలపై గురిపెట్టిన ఆయుధం ఆయన. బాల్యం నుంచే అన్యాయాన్ని, అక్రమాల్ని ఎదురించే తత్వం అలవర్చుకున్న కాళోజీ తన పదిహేడేళ్ల ప్రాయంలోనే భగత్‌సింగ్ ఉరితీతను బాధపడుతూ తొలికవిత్వం రాశారు.

సమాజంలో జరిగే ప్రతి విషయానికి స్పందించడం నైజంగా అలవర్చుకున్న ఆయన వరంగల్ కేంద్రంగా ధిక్కార స్వరానికి, ప్రతిఘటనలకు కేరాఫ్‌గా నిలిచారు. వందల సంఖ్యలో ఆయన రాసిన సాహిత్యమంతా నా గొడవే..ముఖ్యంగా ఒక శతాబ్దపు తెలంగాణ సామాజిక, రాజకీయ చరిత్రంతా ఆయన సాహిత్యమే. బతుకు తప్పదు..బతుకు తప్పదు..అన్న గొప్ప సందేశం నారాయణరావుదే. తెలంగాణ భాషా, యాస, సంస్కృతి, సాహిత్యాలకు ధిక్కార స్వరాన్ని జతచేసి అందరిలో అందరివాడిగా ఒక్కడై తెలంగాణ సైరన్ మోగించిన మహోన్నత వ్యక్తి కాళోజీ..


చిన్ననాటి నుంచే అక్రమాలను ఎదురించే తత్వం ...
కాళోజీరావు, రమాభాయి దంపతులకు జన్మించిన ఆయన పూర్తిపేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్‌రాజా కాళోజీ. ఆయన సోదరుడు కాళోజీ రామేశ్వర్‌రావు. తండ్రి నుంచి మహారాష్ట్ర సత్యాన్ని తల్లి నుంచి కర్ణాటక వారసత్వాన్ని పొంది తెలుగు తత్వంతో పెరిగిన కాళోజీ పూర్వికులు మడికొండ గ్రామంలో స్థిరపడ్డారు. 1940లో ఆయన రుక్మిణిబాయిని వివాహం చేసుకున్నాడు. బాల్యం నుంచే అన్యాయం, అక్రమాలను ఎదురించే తత్వాన్ని అలవర్చుకున్న ఆయన సమాజంలో జరిగే ప్రతి అంశంపై అతను స్పందించడమే కాక సాహిత్యం ద్వారా ఎంతోమందిలో ప్రేరణ కల్పించారు. తొలి తెలంగాణ ఉద్యమంలో స్వయంగా పాల్గొని ప్రత్యేక రాష్ట్రం కోసం నినదించిన ఉద్యమకారుడు ఆయన. 1969 మే 1వ తేదీన వరంగల్ పట్టణంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ సదస్సులో కాళోజీ సంధించిన కవితాస్ర్తాలు తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఆయన ఆనాడే ఏకరువు పెట్టారు. విడిపోతే జరిగే నష్టం ఏమిటో నిక్కచ్చిగా చెప్పారు. తొలితరం ఉద్యమంలో కాళోజీ చురుకైన పాత్ర పోషించారు. ప్రాంతంవాడే దోపిడీచేస్తే దూరందాక తన్నితరిమేస్తాం.. ప్రాంతం కానివాడు దోపిడీ చేస్తే పాతరేస్త్తాం..అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళోజీ పదవులు ..
1958 నుంచి 1960 వరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలికి సభ్యత్వం. ఆంధ్ర సారస్వత పరిషత్ సభ్యత్వం, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యత్వం, తెలంగాణ రచయితల వేదిక గౌరవ అధ్యక్షుడిగా కొనసాగారు.

నా భాషకు సంకుచితత్వం లేదని చాటిన మహనీయుడు
కాళోజీకి విలక్షణమైన సాంస్కృతిక నేపథ్యం ఉంది. తల్లి కన్నడిగా, తండ్రి పూర్వికులు మహారాష్ట్రీయులు. మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ కుటుంబం వారిది. ఆయనకు తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. నా కులం, నా ప్రాంతం, నా భాష అనేక సంకుచితత్వం లేదు ఆయనకు. నేనింకా నా నుంచి మా వరకే రాలేదు. మనం అన్నప్పుడు కదా ముందడుగు అంటారాయన. సంస్థలకు, పార్టీలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొనేవారు. పౌర సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా తాను ప్రతిఘటిస్తానని, ఎక్కడ ప్రజలపై దౌర్జన్యం జరుగుతున్నా అక్కడ వాళ్ల పక్షాన పోరాడుతానని ఓ సందర్భంలో పోలీసులకు సమాధానం ఇచ్చారట. ఆయన పౌరహక్కుల కోసం పోరాడారు. అంత మాత్రాన నక్సల్ భావజాలాన్ని ఆమోదించినట్లు కాదు. బాల్యంలో గణపతి ఉత్సవాల్లో నిమజ్జనం రోజున విద్యాసంస్థలకు సెలవు ఇవ్వకపోతే విద్యార్థులతో తరగతులు బహిష్కరింపజేసిన వ్యక్తి ఆయన. అయితే ఆయన మతోన్మాదికాదు, ఇతరుల స్వేచ్ఛను ఆటంకపర్చరాదని ఆయన ఉద్దేశం.

నిజాం పాలనలో ప్రజల మనోభావాలను కించపర్చిన సందర్భాల్లోనూ ఆయన పోరాడారు. రాజకీయ జీవితమంతా ఆర్యసమాజంలోనూ ఆరంభమైంది. ఆయన గాంధేయవాది. అహింస గొప్పదే కాని నేను పిరికితనం కన్నా హింసనే సమర్థిస్తాను అన్న గాంధీజీ సూక్తి ఆయన కలాన్ని ఆయుధం చేసింది.

మాతృదేశమన్నా, మాతృభాష అన్నా అమితమైన అభిమానం..
కాళోజీకి మాతృదేశమన్నా, మాతృభాష అన్నా అమితమైన అభిమానం ఆయనది. ఈ రోజుల్లో నిత్య వ్యవహారానికి తెలుగుకు బదులు ఆంగ్లం రాజ్యమేలుతున్నది. నిజాం పాలనలో ఉర్దూ రాజ్యమేలింది. తెలుగువారు తమకు తెలుగు రాదంటూ ఇతర భాషల్లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నారు. ఈ దురవస్థను చూసిన కాళోజీ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా? అని ఈసడించుకున్నారు.

ఉదయం కానే కాదనుకోవడం నిరాశ
ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం
దురాశ అని ఆయన సందేశం.
నేను ప్రస్తుతాన్ని -గతానికి శిఖరాన్ని
వర్తమానాన్ని-భావికి ఆధారాన్ని
నిన్నటి స్వప్నాన్ని-రేపటి జ్ఞాపికను
ఖలీల్ జిబ్రాన్ వ్యాఖ్యలను అనుసృజనమైన ఈ మాటల్లో కాళోజీ స్వీయతాత్వికత వెల్లడవతుంది. ప్రతి కొత్త భావంలోని మంచిని స్వీకరిస్తూ వచ్చిన విశ్వప్రేమికుడు, ఆదర్శవాది కాళోజీ. ఆయన మనసున్న మనిషిగా జీవించారు. మనిషికై పోరాడారు. మనిషికోసం కవిత్వం రాశారు. పీ.వీ.నరసింహారావు- కాళోజీని గురించి బ్రహ్మ నీకు పోరాటమైన పాపుల వయసిచ్చుగాకకాలుడూ మా కాళయ్యను కలకాలం మరచుగాక జాతస్య మరణం ధృవమ్ కదా! కాళోజీ యశఃకాయుడు.

పురస్కారాలు
* 1968లో జీవన గీత ఉత్తమ అనువాద పురస్కారం.
* బూర్గుల రామకృష్ణారావు మెమోరియాల్ తొలి అవార్డు
* 1992లో పద్మ విభూషన్ పురస్కారం
* 1992లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్
* 1996లో సహృదయ సాహితీ విశాఖ వారి గురజాడ అవార్డు.
* 1996లో కళసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురస్కారం.

కాళోజీ రచనలు...
నా గొడవ, కాళోజీ కథలు, అణాకథలు, నా భారతదేశ యాత్రతో పాటు తెలంగాణ తొలిదశ ఉద్యమంలో తెలంగాణ వెనుకబాటుపై ఎన్నో కవిత్వాలు రచించారు. దేశోద్ధ్దారక గ్రంథమాల, నా గొడవ పరాభవ వసంతం, గ్రీష్మం, పరాభావ వర్షం, పరాభావ శరత్, పరాభావ హేమంతం శిశిరం సంపుటాలు కాళోజీ కథానికలు. తెలంగాణ ఉద్యమ కవితలు, యువ భావతి, ఏలూరు సంక్రాంతి మిత్రులు తదితర రచనలను ప్రజలకు అందజేశారు.

తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై తన కవితలు, సాహిత్యం ద్వారా ఉద్యమానికి ఊపిరి పోశారు.అవకతవకలను చూసి ఆరోజుల్లోనే కాళోజీ నాగొడవ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన జీవితం, సాహిత్యం నిత్యనూతనమైనది. జీవితమంతా ప్రజాపోరాటాల్లో భాగస్వాములయ్యారు. ఆయన కలం నుంచి జాలు వారిన ఒక్కో అక్షరం..ఒక్కో తూటా బావి తరాలకు స్ఫూర్తిదాయకం. గణపతి ఉత్సవాలు, గ్రంథాలయా ఉద్యమం, ఆర్య సమాజ కార్యక్రమాలు, రజాకార్ల ప్రతిఘటన, స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాలు, ఆంధ్రమహాసభలు, తెలంగాణ రైతాంగ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, రెండు తెలంగాణ ఉద్యమాలు, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాటం, పౌరహక్కుల పోరాటం మొదలైన అన్ని ఉద్యమాలకు ఆయన స్పందించారు.

2312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles