కేజీబీవీలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం : కడియం

Mon,July 17, 2017 06:50 PM

kadiyam srihari says about kgbv schools


హైదరాబాద్ : కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ)ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వాటిని అభివృద్ధి చేస్తుందని కడియం శ్రీహరి వెల్లడించారు. ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల కేజీబీవీల్లో విద్యార్థుల నమోదు శాతం, ఫలితాలు పెరిగాయన్నారు. ఇవాళ విద్యాశాఖ ఉన్నతాధికారులతో కడియం శ్రీహరి సమావేశమై కేజీబీల అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో కడియం మాట్లాడుతూ కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు లేనివారు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరే ఉన్నవారు, కడుపేద కుటుంబాల పిల్లలు చదువుతారని, వీరికి మంచి విద్య, వసతులు కల్పించేందుకు కేంద్రం వద్ద ప్రతీసారి తాను కొట్లాడుతున్నానని కడియం వెల్లడించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే కేజీబీవీలు బాగా పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కితాబునిచ్చారని కడియం అన్నారు.

ఒకవైపు కేజీబీవీలలో వసతులు మెరుగుపరుస్తూనే మరోవైపు వేతనాలు కూడా పెంచుతున్నట్లు కడియం చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్నదన్నారు. తద్వారా ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని చెప్పారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం కార్పోరేట్ విద్యాలయాల్లో పదివేల మంది విద్యార్థులు తగ్గారని..దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడం, ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడమేనన్నారు. గత ఏడాది కేజీబీవీల్లో పనిచేసే స్పెషల్ ఆఫీసర్ల వేతనాలను రూ. 15 వేల నుంచి 20 వేలకు, సీఆర్టీల వేతనాన్ని రూ. 9 వేల నుంచి 15 వేలకు పెంచారన్నారు. మళ్లీ ఈ సంవత్సరం స్పెషల్ ఆఫీసర్ల వేతనాన్ని రూ.20 వేల నుంచి 25 వేలకు పెంచేందుకు, సీఆర్టీల వేతనాన్ని 15 వేల నుంచి 20 వేలకు పెంచాలన్న ప్రతిపాదన సీఎం కేసిఆర్ వద్ద ఉందన్నారు.
kgbv-kadiyam1

కేజీబీవీలను పటిష్టం చేయాలని ప్రతీసారి తాను కేంద్ర మంత్రి జవదేకర్ ను అడుగుతున్నానని కడియం శ్రీహరి చెప్పారు. ప్రస్తుతం 6,7,8 వ తరగతులకే కేంద్రం ఆర్ధికసాయం చేస్తోందన్నారు. 8,9,10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తోందన్నారు. కేంద్ర సాయాన్ని పదో తరగతి వరకు పెంచాలని కోరామని, దీనిపట్ల కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పదో తరగతి వరకు ఆర్ధికసాయం అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం వీటిని జూనియర్ కాలేజీల వరకు అప్ గ్రేడ్ చేసే ఆలోచనలో ఉందన్నారు. కేజీబీవీలలో టీచర్లను కూడా కేంద్రం కేవలం నలుగురికి మాత్రమే వేతనాలు చెల్లిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మరో ముగ్గురిని అదనంగా పెట్టుకుని వారికి వేతనాలు ఇస్తున్నట్లు వెల్లడించారు.  


 ఇక భోజనానికి సంబంధించి గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలలో ఒకే రకమైన భోజనం అందించేవిధంగా మెనూ రూపొందించినట్లు కడియం వెల్లడించారు. ఈ మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి నెలకు వెయ్యి రూపాయల ఖర్చు వస్తోందన్నారు. ఇటీవల మెస్ ఛార్జీలు పెంచామని, అయినా పెరిగిన ధరల నేపథ్యంలో తమకు ఇచ్చే మొత్తం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు అడుగుతున్నట్లు చెప్పారు. ఈ విషయమై కాంట్రాక్టర్లతో చర్చించి, విద్యార్థులకు లోటు లేకుండా భోజనం అందిస్తున్నామని కడియం చెప్పారు.  

1645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS