రైతుల కోసం విప్లవాత్మకమైన పథకాలు : కడియం

Wed,May 16, 2018 02:07 PM

Kadiyam Srihari distributes rythubandhu cheques in Janagama

వరంగల్ : దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు ఆలోచించని విధంగా రైతును రాజు చేయాలని సీఎం కేసిఆర్ నిరంతరం ఆలోచించి విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీలు ఏనాడైనా రైతు గురించి ఇలా ఆలోచించారా? అని ప్రశ్నించారు. రైతు బంధు కార్యక్రమంలో భాగంగా వడ్లకొండ గ్రామం, జనగామాలో నేడు రైతులకు పాస్ బుక్కులు, చెక్కులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పంపిణీ చేశారు.

జనగామా ఎమ్మెల్యేగా ఉండి, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇక్కడి నుంచి పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య ఏనాడైనా ఇక్కడి చెరువులను నింపాలని ఆలోచించారా? రైతుకు పెట్టుబడి ఇవ్వాలనిగానీ, రైతుల రుణాలు మాఫీ చేయాలనిగానీ ఆలోచించారా? అని ఉప ముఖ్యమంత్రి అడిగారు. కాంగ్రెస్ నేతలకు ఎన్నడూ ఈ ఆలోచన ఎందుకు రాలేదన్నారు. నాలుగేళ్ల క్రితం వ్యవసాయం ఎంత సమస్యగా ఉంది, కరెంటు రాక, ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేక, సాగునీటి గురించి పట్టించుకోక రైతును తీవ్ర అవస్థల పాలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక టిఆర్ఎస్ మేనిఫెస్టోలోనే తాము అధికారం చేపడితే వ్యవసాయానికి పగటిపూట 9గంటల ఉచిత్ విద్యుత్ ఇస్తామని, రైతుకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని నెరవేర్చామని చెప్పారు. ఎరువులు, విత్తనాలకు ఇబ్బంది లేకుండా ముందే స్టాక్ చేసి పెడుతున్నారని, సాగునీరు అందించేందుకు చెరువులల్లో నీరు నింపుతున్నారని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు రైతు పెట్టుబడి కోసం ఎకరానికి 4000రూపాయల చొప్పున ఏటా 8000 రూపాయలు అందిస్తున్న ఏకైక సిఎం కేసిఆర్ అన్నారు. రైతు ప్రమాద వశాత్తు చనిపోతే ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా కల్పించే రైతుబీమా పథకాన్ని ఈ ఏడాది జూన్ 2 నుంచి అమలు చేయనున్నారని చెప్పారు.

రైతును రాజు చేసే పథకాలు అమలు చేయడంతో పాటు పేదింట్లో ఆడపిల్ల పెళ్లి కోసం మొదట్లో 51వేల రూపాయలు ఇచ్చారని, అవి సరిపోవని దానిని 75వేల రూపాయలు చేశారని, ఇంకా సరిపోవడం లేదని సిఎం స్వయంగా గుర్తించి దానిని ఇప్పుడు 1,00,116 రూపాయలకు పెంచారన్నారు. అదేవిధంగా 16 వస్తువులతో కేసిఆర్ కిట్ ఇస్తున్నారని, గర్భణీ స్త్రీలకు ప్రసవం ముందు, తర్వాత ఆరు నెలల పాటు నెలకు 2000 చొప్పున 12000 రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలు కలిపి 13000 రూపాయలు ఇస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం నిత్యం ఆలోచిస్తున్న సిఎం కేసిఆర్ ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. అనంతరం రైతులకు పాస్ బుక్కులు, చెక్కులు పంపిణీచేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మండలి విఫ్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles