శర వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం : సీఎం కేసీఆర్

Fri,September 15, 2017 06:04 PM

irrigation projects will complete within time says cm kcr

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలను అనుకున్న సమయానికి నిర్మిస్తామని ఉద్ఘాటించారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాలు పూర్తయితే కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని సీఎం తేల్చిచెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్‌కు రూ. 25 వేల కోట్లు కేటాయించాం. బ్యాంకుల ద్వారా మరో రూ. 20 కోట్లు తీసుకున్నామన్న సీఎం.. మొత్తంగా రూ. 45 వేల కోట్లు ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెడుతున్నామని కేసీఆర్ వెల్లడించారు.

నెక్లెస్ రోడ్డులో సంచార పశు వైద్యశాలల ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రూ. 14.65 లక్షల ఖర్చుతో 100 సంచార వైద్యశాలలు ప్రారంభించామని తెలిపారు. 100 నియోజకవర్గాల్లో ఈ వైద్యశాలలు అందుబాటులో ఉంటాయన్న సీఎం.. 1962 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసిన 30 నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ మీ వద్ద ఉంటుందని స్పష్టం చేశారు.

రైతాంగానికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాం
రాష్ట్ర రైతాంగానికి కావాల్సిన వనరులన్నీ సమకూరుస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ బాధలు లేవు అన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. రైతాంగానికి కావాల్సిన మూడు విషయాలు సాగునీరు, పెట్టుబడి, పండించిన పంటకు గిట్టుబాటు ధరకావాలి. ఈ మూడింటి విషయంలో ప్రభుత్వం పక్కా ప్రణాళికను అమలు చేస్తుందన్నారు. సాగునీటికి సంబంధించి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మిస్తున్నాం. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలను అనుకున్న సమయానికి నిర్మిస్తాం. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా కోటి ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. తర్వాత రైతులకు పెట్టుబడి సమకూర్చడం. ఎకరానికి 4 వేల చొప్పున సంవత్సరానికి 8 వేలు ఇస్తామని తెలిపినం. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి, రైతాంగానికి మధ్య రైతు సమన్వయ సమితులు ఉంటాయన్నారు. పంటకు గిట్టుబాటు ధర తెచ్చేందుకు ఈ సంఘాలు పని చేస్తాయన్నారు. ఇతర పార్టీల నేతలు ప్రగతి నిరోధకులుగా మారొద్దని సూచించారు సీఎం.

దసరాలోపే 20 లక్షల గొర్రెల పంపిణీ
గొల్లకురుమల సంక్షేమమే లక్ష్యంగా గొర్రె పిల్లల పంపిణీ చేపట్టామని సీఎం తెలిపారు. రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టామన్న సీఎం.. ఇప్పటికే 18 లక్షల 74 వేల గొర్రెలు పంపిణీ చేశాం. దసరా లోపే మరో 20 లక్షల గొర్రెలు పంపిణీ చేయబోతున్నామని ప్రకటించారు. 84 లక్షల గొర్రెలు తెచ్చి పంపిణీ చేస్తామంటే చాలా మందికి నమ్మకం కలగలేదు. ఏది చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే.. ఏదైనా చేయవచ్చు. గొర్రెల పంపిణీ విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు కృషి అభినందనీయమన్నారు. దరఖాస్తు చేసుకున్న 7 లక్షల మందికి గొర్రె పిల్లలను పంపిణీ చేస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. మిగతా 60 లక్షల గొర్రెలను కూడా పంపిణీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ యాదవులు ధనవంతులు కావాలని సీఎం అన్నారు. 4 సంవత్సరాల తర్వాత ధనవంతమైన యాదవులు ఎక్కడా ఉన్నారంటే.. తెలంగాణలో ఉన్నారనే మాట రావాలన్నారు. గొర్రెలను ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలన్నారు.

ఈ ఏడాది 70 కోట్ల చేప పిల్లలు తెప్పించాం
గతేడాది 27 కోట్ల చేప పిల్లలను చెరువులో వదిలామని సీఎం గుర్తు చేశారు. ఈ ఏడాది 70 కోట్ల చేప పిల్లలను తెప్పించారు. వాటిని క్రమంగా చెరువుల్లో వదులుతున్నారని సీఎం చెప్పారు. చేప ఉత్పత్తి కేంద్రాలను గతంలో ధ్వంసం చేశారు. ట్యాంక్‌బండ్ కింద చేప ఉత్పత్తి కేంద్రం ఉండేది. అలాంటి వాటన్నింటిని తిరిగి పునరుద్ధరించాలని ఆదేశాలిచ్చామని సీఎం పేర్కొన్నారు. నీటి సదుపాయం ఉన్న చోట చేపలను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యకారులను అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం ఉద్ఘాటించారు.

1669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles