స్కూల్ ఫీజు కట్టడం ఆలస్యమైనందుకు వడ్డీ వసూలు

Sun,July 21, 2019 07:01 AM

Interest charges for late payment of school fees

మేడ్చల్ : ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీ రోజురోజుకు పెరిగిపోతున్నది. పేరెంట్స్ బలహీనతలను ఆసరగా చేసుకుంటున్న యాజమాన్యాలు అందినకాడికి దుండుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్, డొనేషన్ వంటి ఫీజులు మొదలు కొని పరీక్ష ఫీజుల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి ఏటా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. తాజాగా ఓ స్కూల్ యజమాన్యం ఫీజుచెల్లింపులో ఆలస్యంఅవుతుందనే నెపంతో వడ్డీ వసూలు చేస్తుంది. ఇంత జరుగుతున్నా సంబంధింత అధికారులు నోరుమెదపక పోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్పటికీ స్కూల్ నిర్వాహకులు ఇచ్చే అమ్యాయ్యాల కారణంగా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఫలితంగా పాఠశాలల యాజమాన్యాలు పేరెంట్స్ ముక్కుపిండి మరీ అధికఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో అధికంగా చోటు చేసుకుంటుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలస్యమైనందుకు...10శాతం వడ్డీ చెల్లించండి
కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాశ్‌నగర్ డివిజన్, సూరారంకాలనీలోని కేవీఎం ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతీరు తల్లిదండ్రులను విస్మయానికి గురిచేస్తున్నది. ఓ విద్యార్థికి సంబంధించిన ఫీజు చెల్లించడంలో కొద్దిగా ఆలస్యం కావడంతో చెల్లించాల్సిన డబ్బుల(ఫీజు)తో పాటు అదనంగా 10శాతం వడ్డీ చెల్లించాలని, లేని పక్షంలో సదరు విద్యార్థిని తమ పాఠశాల నుంచి తీసుకు వెళ్లవచ్చునని చెప్పడంతో తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. నాలుగేండ్లుగా తమ పిల్లలిద్దర్ని ఇదే పాఠశాలలో చదివిస్తున్నామని, ఈ ఒక్కసారి మాత్రమే లేటైందని, ఈ విషయంలో తమను మన్నించాలని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. మీరు ఆలస్యం చేయడం వల్లే తాము బయట 5శాతం వడ్డీ చెల్లిస్తున్నామని, దీనికెవరు బాధ్యత వహిస్తారని పాఠశాల అకౌంటెంట్ ఎదురు ప్రశ్నించడంతో తల్లిదండ్రులు బిక్కమొఖం వేశారు. ఈ తతంగం అంతా ఓ వ్యక్తి తన మోబైల్ ఫోన్‌లో వీడియో తీసి వాట్సప్‌లో పెట్టడంతో శనివారం అది వైరల్‌గా మారింది. ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి ఇది పరాకాష్టగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. సదరు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.
వడ్డీ ఇవ్వాలనడం నేరం : ఎంఈఓ
కాగా.. ఇదే విషయమై ఎంఈఓ ఆంజనేయులును వివరణ కోరగా.. ప్రైవేట్ పాఠశాలల్లో ఎంతఫీజు చెల్లించాలనేది తమకు సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని పాఠశాల గవర్నింగ్ బాడీ నిర్ణయిస్తుందన్నారు. అయితే ఫీజు చెల్లింపు ఆలస్యమైందనే నెపంతో వడ్డీ చెల్లించమనడం నేరమవుతుందని స్పష్టం చేశారు. సంబంధిత పాఠశాలపై చర్యలు తీసుకుంటామని ఎంఈఓ పేర్కొన్నారు.

664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles