ఎండా కాలంలో ఊరెళ్తున్నారా?... పోలీసులకు చెప్పండి..

Tue,March 19, 2019 09:38 AM

inform to hyderabad police going to village

హైదరాబాద్ : ఎండా కాలంలో ఊరెళ్తున్నారా?... దొంగల భయం ఉం దా?... మీ సొమ్ము భద్రంగా ఉండాలా?.. అయితే మేము చెప్పే జాగ్రత్తలు పాటించాలంటూ సైబరాబాద్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. పరీక్షలు పూర్తికాగానే ప్రజలు విహారయాత్రలు, సొంత ఊర్లకు వెళ్తుంటారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇంటి పరిసరాలకు రక్షణ కంచెలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వైపు ఎండలు మండిపోతుండడంతో రాత్రి సమయాల్లో ఇంటికి తాళం వేయకుండా, కేవలం గడియ పెట్టి బంగ్లాపై పడుకుంటారు. మరికొందరు ప్రధాన ద్వారం పక్కన ఉండే కిటికీలను తెరిచి పడుకుంటారు. ఇలా... చిన్న చిన్న నిర్లక్ష్యాలు దొంగలకు అవకాశాలు ఇచ్చినట్లు ఉంటుంది. ఈ క్రమంలో ప్రజలు వస్తువులను పోగొట్టుకోకుండా ఉండేందుకు జాగ్రత్తలతో చోరీలకు కళ్లేం వేయాలని పోలీసులు ప్రచారాన్ని ప్రారంభించారు. దీని కోసం సైబరాబాద్ సైబర్ క్రైం, స్థానిక పోలీసులు అవగాహనతో పాటు నేరస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

అమావాస్య... వారికి అదృష్టం


ఎండకాలంలో దొంగలకు కలిసి వచ్చేది మధ్యాహ్నం, అర్ధరాత్రి సమయాలే. అందులో అమావాస్య చీకటి వారికి మరింతగా కలిసి వస్తుంది. ఎందుకంటే అమావాస్య చీకటిలో వెలుతురు లేకుండా అంధకారం అధికంగా ఉండడం వారికి లక్కీగా మారుతుందని పలువురు దొంగలు పట్టుబడ్డప్పుడు బయటపడిన విషయం. ఈ కాలంలో దొంగలు మధ్యాహ్నం సమయంలో రెక్కీ చేసుకుని రాత్రి సమయాల్లో తెగబడతారు. తెరిచి ఉన్న కిటీకీల నుంచి కర్ర, ఇనుప రాడ్‌లతో ప్రధాన ద్వారాన్ని తెరవడం, లేదా వాటితో కనిపించే విలువైన వస్తువులను దొంగిలిస్తారు. దీని కోసం సరైన భద్రత ప్రమాణాలను పాటించని ఇండ్లు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ఇండ్ల ను ఎంపిక చేసుకుంటారు. ఈ కాలంలో ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలను కూడా దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తారు. ఈ చోరీలను అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు....


* ఇంటికి తాళాలు వేసుకుని ఊళ్లకు, విహారయాత్రలకువెళ్లేవారు ఫోన్ నంబర్, ఇంటి చిరునామాను స్థానిక పోలీసులకు తెలపాలి.
* ఇంటి పక్కవారికి లేదా నమ్మకమైన వారికి తాళం ఉన్న ఇంటిని గమనిస్తుండాలని కోరాలి.
* ఇంటికి తాళం వేసి బయట పెట్టొద్దు
* కిటికీలను పూర్తిగా మూసివేయాలి
* బంగారు ఆభరణాలు వేసుకుని బయట పడుకోవద్దు
* తాళం బయటికి కనపడకుండాజాగ్రత్తలు తీసుకోవాలి
* ఇంట్లోని నగదు, విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక లావాదేవిల గురించి బహిరంగంగా చెప్పుకోవద్దు
* ఇంట్లో ఒంటరిగా ఉండే వారు అనుమానాస్పద వ్యక్తులను లోపలికి రానివ్వద్దు.
* మధ్యాహ్న సమయాల్లో కాలనీల్లో తిరుగుతూ అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి.
* ఇంటికి తాళం వేసి వెళ్లినప్పుడు టైమర్‌తో కూడిన లైట్లను ఏర్పాటు చేసుకోవాలి.
* ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉండాలి.
* తాళం వేసి వెళ్తునప్పుడు అలారమ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
* మహిళలు ఆభరణాలు ధరించి బయటికి వెళ్తున్న సమయంలో కొంగును నిండుగా కప్పుకోవాలి.
* విలువైన వస్తువులను లాకర్లలో పెట్టుకోవాలి.
* వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇంట్లో ఒంటరిగాఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* రైల్వేట్రాక్ పక్కన ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి.
* కాలనీ అసోసియేషన్‌లు కమిటీలను ఏర్పాటు చేసుకుని సీసీ కెమెరాలు, వాచ్‌మన్‌లను పెట్టుకోవాలి.
* ప్రతి ఒక్కరూ స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్, బీట్ కానిస్టేబుల్ నంబర్‌ను దగ్గర పెట్టుకోవాలి.
* ఇండ్లను అద్దెకు ఇచ్చే సమయంలో పూర్తి వివరాలు , ఆధార్ లేదా ఇతర ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి.
* చిన్నారుల మెడలో ఎక్కువగా బంగారం ఉంచొద్దు.
* ఎక్కువగా శబ్దం చేసే కూలర్లు, ఫ్యాన్‌లను వాడడం వల్ల రాత్రి సమయాల్లో దొంగల అలికిడి వినలేం.
* కుక్కలను పెంచుకోవడం మంచిది.
* శుభకార్యాల్లో దృష్టి మళ్లించి బంగారం ఆభరణాలను ఎత్తుకెళ్ళే దొంగలు తిరుగుతుంటారు. అందుకే అపరచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పాలి.

1868
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles