మిస్టర్ క్లీన్.. ఇంద్రకరణ్ రెడ్డి

Tue,February 19, 2019 12:13 PM

పూర్తి పేరు : అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
పుట్టిన తేదీ : 16-02-1949
తల్లిదండ్రులు : చిన్నమ్మ, నారాయణరెడ్డి
భార్య : విజయలక్ష్మి
పిల్లలు : కుమారుడు గౌతం రెడ్డి, కోడలు దివ్యారెడ్డి, కూతురు పల్లవిరెడ్డి, అల్లుడు రంజిత్‌ రెడ్డి
విద్యార్హత : బీకాం, ఎల్‌ఎల్‌బీ
చేపట్టిన శాఖ: న్యాయశాఖ, దేవాదాయ, అడవులు, పర్యావరణం


సీఎం కేసీఆర్‌కు నమ్మకస్తుల్లో ఒక్కరిగా, సమర్థవంతమైన నాయకుడిగా ముద్ర వేసుకున్న నిర్మల్‌ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి వర్గంలో మరోసారి అవకాశం లభించింది. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవమున్న ఐకే రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన నాటి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేస్తూనే సీఎం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మిస్టర్‌క్లీన్‌గా రాజకీయాల్లో రాణిస్తున్న ఐకే రెడ్డికి సీఎం కేసీఆర్‌ మరోసారి క్యాబినెట్‌ బెర్తు ఖాయం చేశారు.

2014లో కేసీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసిన అల్లోలకు మరోసారి అవకాశం లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఐకే రెడ్డికి ఒక్కరికే తాజా మంత్రి వర్గంలో అవకాశం లభించింది. 2014 ఎన్నికల్లో నిర్మల్‌ నియోజకవర్గం నుంచి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్‌(టీ) నియోజకవర్గం నుంచి ఆయన శిష్యుడు కోనేరు కోనప్ప బీఎస్పీ అభ్యర్థులుగా విజయం సాధించారు. తరువాత బీఎస్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసి ప్రభుత్వ సుస్థిరతకు అండగా నిలిచారు. ముథోల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున విజయం సాధించిన తన సన్నిహితుడు విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంలో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ సుస్థిరతకు అండగా నిలిచిన ఐకే రెడ్డిని సీఎం కేసీఆర్‌ తన మంత్రివర్గంలోకి తీసుకుని గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. 2018 ఎన్నికల్లో నిర్మల్‌ నియోజకవర్గం నుంచి ఐకే రెడ్డి మళ్లీ విజయం సాధించారు.

‘సమర్థత’కు మరోసారి అవకాశం
మంత్రిగా సమర్థవంతంగా పని చేశారని సీఎం కేసీఆర్‌ ప్రశంసలందుకున్న ఐకే రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికీ అదే స్థాయిలో కృషి చేశారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా పని చేసిన వారెవరూ తరువాతి ఎన్నికల్లో విజయం సాధించలేదని, ఆ కోవలోనే ఐకే రెడ్డికి 2018 ఎన్నికల్లో పరాజయం తప్పదని ప్రత్యర్థులు దుష్ప్రచారం చేసినా నియోజకవర్గ ప్రజలు ఆయనకు విజయాన్ని కట్టబెట్టారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఐకే రెడ్డి జడ్పీ చైర్మన్‌ స్థాయి నుంచి మంత్రి వరకు వివిధ హోదాల్లో పని చేశారు. ఉమ్మడి జిల్లా రాజకీయలపై తనదైన ముద్రవేసిన ఐకే రెడ్డికి కిందిస్థాయి కార్యకర్త నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరితోనూ సత్సంబంధాలున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న ఐకే రెడ్డి నిర్మల్‌ నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014, 2018లో ఎమ్మెల్యేగా నాలుగుసార్లు విజయం సాధించారు. 1987-1991 మధ్య జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, 1991-1996, 2008-2009 కాలంలో రెండుసార్లు ఆదిలాబాద్‌ ఎంపీగా పని చేశారు. 1992లో తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నర్సింహరావు ప్రధానమంత్రిగా ఉండగా, మైనార్టీలో ఉన్న పీవీ ప్రభుత్వానికి జాతి ప్రయోజనాల దృష్ట్యా మద్దతుగా నిలిచారు.

మిస్టర్‌ క్లీన్‌
మిస్టర్‌ క్లీన్‌గా పేరున్న ఐకే రెడ్డి.. వివాదరహితునిగా, సమర్థత, నిజాయితీతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌లో కొనసాగిన కాలంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ ఫోరం కన్వీనర్‌గా, తెలంగాణ రీజినల్‌ కాంగ్రెస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మకస్తులలో ఒకరిగా కేబినెట్‌లో కొనసాగారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు, ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ఐకే రెడ్డి అసంతృప్తులను బుజ్జగించడంలో కీలక పాత్ర పోషించారు.

2821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles