'గీత' దాటుతున్న పోలీస్...!

Wed,February 6, 2019 10:04 AM

indiscipline in the police department

హైద‌రాబాద్‌: క్రమ శిక్షణకు మారుపేరుగా ఉన్న హైదరాబాద్ పోలీసుల్లో కొందరు హద్దు మీరుతున్నారు. ఉన్నత స్థాయి నుంచి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతోనే కిందిస్థాయి అధికారులు గీత దాటుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంతో పాటు దేశానికే హైదరాబాద్ పోలీసులు ఆదర్శంగా ఉంటున్నారు. కొన్నిరోజులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ఘటనలతో కొందరు పోలీసులు గీత దాటుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న అధికారులు జిల్లాలకు, జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు.

ఇందులో కొందరు హైదరాబాద్ పోలీసింగ్‌తో సర్ధుకుపోలేని పరిస్థితిలో ఉన్నారు. కొత్తగా వచ్చిన అధికారులను హైదరాబాద్ పోలీసింగ్‌కు సరిపోయిన విధంగా తీర్చిదిద్దడంలో ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఒకటి రెండు సమావేశాలు ఏర్పాటు చేసి ఇలా , అలా చేయాలంటూ సూచనలు ఇవ్వడం వరకే పరిమితమవుతున్నారు. పైపై చర్యలతోనే సరిపెడుతుండడంతో హైదరాబాద్ పోలీసింగ్‌లో గతానికి భిన్నంగా పట్టు తప్పుతున్నదని సమాచారం.

ప్రవర్తన సరిగ్గాలేక బదిలీలు
సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నలుగురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. అందులో నల్లకుంట ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లు కూడా ఉన్నారు. ఆయనను నల్లకుంట నుంచి మెయిన్ పీసీఆర్‌కు బదిలీ చేశారు. అయితే జయరాం హత్య కేసులోని నిందితుడు రాకేశ్‌రెడ్డితో సంబంధాలున్నాయని పలు ఆరోపణలు వచ్చాయి. దీన్ని హైదరాబాద్ సీపీ ఖండించారు. మంగళవారం ఏపీ పోలీసులు జయరాం హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన సందర్భంగా తెలంగాణకు చెందిన ఇద్దరు పోలీసులతో రాకేశ్‌రెడ్డికి సంబంధాలున్నాయని వెల్లడించడం గమనార్హం. దీంతో శ్రీనివాస్‌లు బదిలీకి ఇదే ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా.... సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ గంగారాం, ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డిని కార్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. వీరి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతోనే సీపీ ఈ బదిలీ చేసినట్లు తెలుస్తున్నది. అయితే వీరి బదిలీకి గల కారణాలపై ట్రాఫిక్ విభాగంలోని అధికారుల వద్ద కూడా తగిన సమాచారం లేదు. ఇటీవల బేగంపేట్ ఇన్‌స్పెక్టర్ బుచ్చయ్యను కూడా బదిలీ చేశారు. అయిన స్థానంలో కొత్తగా ఉమామహేశ్వరరావును నియమిస్తూ సీపీ అంజనీకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ట్రాఫిక్ విభాగంలో ఓ ఎస్సై పండ్ల వ్యాపారితో దురుసుగా ప్రవర్తించిన ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. నాలుగు రోజుల క్రితం ఇడ్లీ బండి వ్యాపారుల నుంచి పోలీసులు ఉచితంగా ఇడ్లీలు తీసుకెళ్లిన వీడియో కూడా సోషల్‌మీడియాలోకి సర్క్యూలేట్ అయ్యింది. ఇదిలాఉండగా... పాతబస్తీలోను తరుచూ నేర ఘటనలు జరుగుతున్నాయి. గతానికి భిన్నంగా ఇలాంటి ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో...
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీ పరమైన సంస్కరణలతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ఇందులో భాగంగా... అవినీతి రహితంగా హైదరాబాద్ పోలీసింగ్ కొనసాగుతూ వస్తున్నది. అక్కడక్కడ జరుగుతున్న ఘటనలతో హైదరాబాద్ పోలీసింగ్‌కు మరకలు అంటుకుంటున్నాయి. వీటిని ఎప్పటికప్పు డు తూడ్చి గాడిలో పెట్టే ప్రయత్నం ఉన్నతాధికారులు చేస్తున్నా.. ఆశించిన మేర ఫలితం ఉండడం లేదు. చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో పట్టు సడలుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇబ్రహీంపట్నం ఏసీపీపై వేటు
జయరాం హత్య కేసుతో సంబంధముందనే ఆరోపణలతో ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బదిలీ చేశారు. ఆయనను అంబర్‌పేట్‌లోని రాచకొండ కార్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జయరాం హత్య కేసులో అరెస్టయిన రాకేశ్‌రెడ్డికి, మల్లారెడ్డి పరిచయస్తుడు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో లింగారెడ్డి, రాకేశ్‌రెడ్డి స్నేహితుడు ధీరజ్‌రెడ్డి మధ్య భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గత జూన్‌లో రాకేశ్‌రెడ్డి, ధీరజ్‌రెడ్డిలు మా స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి సరిహద్దులను ధ్వంసం చేశారంటూ లింగారెడ్డి ఆదిభట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ధీరజ్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డిలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తు క్రమంలోనే ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో రాకేశ్‌రెడ్డికి స్నేహం ఏర్పడింది. ఆ తరువాత సన్నిహితంగా మారారు. ఈ చొరవతోనే రాకేశ్‌రెడ్డి జయరాంను హత్య చేసిన అనంతరం సలహాల కోసం మల్లారెడ్డికి ఫోన్ చేసి ఉంటాడని ఆరోపణలు వచ్చాయి.

3535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles