మరో రికార్డు సృష్టించిన హైదరాబాద్ 'మెట్రో'..!

Sun,January 13, 2019 08:35 AM

hyderabad metro rail achieves new record with passengers

హైద‌రాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణ ప్రాంగణాలు జనం తాకిడితో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చేసినా రద్దే. రైళ్లు, బస్సులు, మెట్రోరైలు, ఆటోలు, క్యాబ్‌లను గమ్య స్థానాలకు చేరడానికి ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. మెట్రోలో శుక్రవారం ఒక్క రోజు రికార్డు స్థాయిలో 2.41 లక్షల మంది ప్రయాణించారు. నగరంలో ఉంటున్న చాలా మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వలసవచ్చి ఉద్యోగులుగా, వ్యాపారులుగా, కార్మికులుగా స్థిరపడ్డవారున్నారు. వీరందరికీ సంక్రాంతి ముఖ్య పండుగ కావడంతో పండుగ సంబురాలు నిర్వహించేందుకు కుటుంబంతో సహా పల్లెలకు బయలుదేరుతున్నారు.

పండుగకు ఎక్కువమంది గ్రామాలకు వెళ్తారని, ప్రయాణికులకు అనుగుణంగా అంచనావేసి రెగ్యులర్ బస్సులతో పాటు 5,252 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ కేటాయించింది. ప్రత్యేక బస్సులను ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తెలుగు రాష్ర్టాలకు నడుపడంతోపాటు తిరుగు ప్రయాణం కోసం కూడా బస్సులను ఏర్పాటు చేస్తుంది. దీనికితోడు ఏపీఎస్‌ఆర్టీసీ కూడా తమ సర్వీసులను అందుబాటులోకి తెచ్చి హైదరాబాద్ కేంద్రం నుంచి సీమాంధ్ర ప్రాంతాలకు బస్సులను నడిపిస్తుంది. ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, మియాపూర్, కూకట్‌పల్లి, లక్డీకపూల్, అమీర్‌పేట, ఎంజీబీఎస్, జేబీఎస్, కాచిగూడ, ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తున్నాయి. ఇక ప్రైవేటు బస్సులు ఎప్పటి మాదిరిగానే డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తమ సర్వీసులను నడిపిస్తున్నాయి.

దక్షిణమధ్య రైల్వే పండుగకు కొన్ని నెలల ముందే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటి వరకు 203 ప్రత్యేక రైళ్లను ఆపరేట్ చేస్తుంది. ఇందులో 60 అన్‌రిజర్వ్‌డ్ రైళ్లను నడిపిస్తున్నది. విద్యార్ధులకు సంక్రాంతి సెలవులు ప్రకటించడం, ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవు కావడంతో పండుగ సెలవులు కలిసి రావడంతో చాలా మంది గ్రామాలకు ప్రయాణాలు మొదలుపెట్టారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్య కేంద్రాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. మరికొద్ది మంది ట్యాక్సీలు అద్దెకు తీసుకుని వెళ్తున్నారు.

మెట్రో రైలులో పెరిగిన రద్దీ

సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్సులు, రైల్వే ఆపరేటింగ్ పాయింట్ల వరకు చేరుకోవడానికి మెట్రోరైలులో ప్రయాణికులు ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లడానికి నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్‌కు మెట్రోరైలులో వచ్చి, అక్కడి నుంచి బస్సులను ఆశ్రయించారు. రైళ్లలో స్వగ్రామాలకు వెళ్లేవారందరూ సికింద్రాబాద్‌తోపాటు నాంపల్లి రైల్వేస్టేషన్లకు మెట్రోరైలు ద్వారా చేరుకున్నారు. దీంతో శుక్రవారం ఓక్కరోజే 2.41 లక్షల మంది ప్రయాణించారని, ఇంతమంది ప్రయాణించడం మొదటిసారని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా రైళ్లద్వారా ప్రయాణించాల్సిన వారు ఎంఎంటీఎస్ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రైల్వేస్టేషన్లకు చేరుకుంటున్నారు.

6986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles