ఇద్దరి ప్రాణాలు తీసిన డేటింగ్..

Fri,May 10, 2019 07:49 AM

Hyderabad lovers suicide while they are in Dating


వెంగళరావునగర్‌: ఒకరినొకరు ప్రేమించుకున్నారు..సహజీవనం చేశారు..అయితే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి...మనస్తాపంతో ముందుగా యువకుడు ఆత్మహత్య చేసుకోగా..ఐదు రోజుల అనంతరం యువతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటనలు ఎస్సార్‌ నగర్‌, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కడప జిల్లా పులివెందుల మండలానికి చెందిన చంద్రశేఖర్‌ రెడ్డి కుటుంబం 20 ఏండ్ల క్రితం నగరానికి వచ్చి సనత్‌నగర్‌ డివిజన్‌, సుభాష్‌నగర్‌లో స్థిరపడ్డారు.

చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు కల్యాణ్‌రెడ్డి (21) స్విగ్గీలో డెలివరీ బోయ్‌. కాగా...ఇతను..తనతోపాటు కలిసి చదువుతున్న రాజస్థాన్‌కు చెందిన రియా శర్మ(23) తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సుభాష్‌నగర్‌లోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. ఈ విషయం యువకుడి ఇంట్లోవారికి తెలియదు. రోజూ నైట్‌ డ్యూటీ ఉందని చెప్పి..యువతి వద్దకు వెళ్లేవాడు. కాగా..శనివారం ఉదయం కల్యాణ్‌రెడ్డి మద్యం సేవించి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఉదయాన్నే ఎందుకు మద్యం సేవించావంటూ రియాశర్మ అతన్ని నిలదీసింది. దీంతో ఆమె..అలిగి నిన్ను విడిచి వెళ్లిపోతున్నానని చెప్పి బయటకు వెళ్లిపోయింది. ఇంట్లో నుంచి శబ్దం వినిపించగా..తిరిగి ఇంట్లోకి వచ్చిచూడగా వంట గదిలో కల్యాణ్‌ ఉరివేసుకుని కనిపించాడు. ఇరుగు పొరుగువారిని పిలిచి కిందకు దింపింది. అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

ఐదు రోజుల అనంతరం యువతి..


ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి రియాశర్మ మనస్తాపానికి గురైంది. ఆమెకు తల్లిదండ్రులు లేరని చెప్పడంతో ఎస్సార్‌నగర్‌ పోలీసులు కూకట్‌పల్లిలోని హోంకు తరలించారు. ప్రియుడు మరణించిన మనోవేదనతో అక్కడ మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉండిపోయింది. దీంతో గమనించిన సిబ్బంది భయపడి తిరిగి ఎస్సార్‌ నగర్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నచ్చచెప్పినా హోం అధికారులు యువతిని తిరిగి తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో యువతికి నచ్చచెప్పి అమీర్‌పేటలోని అనుపమ హోస్టల్‌లో చేర్పించారు.

కాగా..బుధవారం బయటకు వెళ్లి..తిరిగి వచ్చిన రియా శర్మ గురువారం తలుపులు తీయలేదు. దీంతో హాస్టల్‌ యజమాని తలుపులు తీసేందుకు విఫలయత్నం చేశాడు. కిటికీ నుంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉంది. వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. రియా శర్మకు తల్లిదండ్రులు లేరని చెప్పిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి బంధువుల ఆచూకి తెలిస్తే వారికి మృతదేహాన్ని అప్పగిస్తామని తెలిపారు.

15418
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles