కండరాల బలహీనతలో హైదరాబాద్‌ది మూడో స్థానం

Fri,July 27, 2018 06:44 AM

హైదరాబాద్ : హైదరాబాదీలు ప్రపంచంతో పోటీపడుతూ పోషకాహారం గురించి మరిచిపోతున్నారు.. ఉరుకులు పరుగుల జీవితంలో సరైన తిండి తినడం లేదు. మారుతున్న జీవనశైలి పౌష్ఠికాహారానికి దూరం చేస్తున్నది. ఫలితంగా హైదరాబాదీల్లో కండరపుష్టి తగ్గిపోతున్నది. మూడొంతుల మందిలో కండరాలు తక్కువ పరిమాణంలో, బలహీనంగా ఉన్నాయి. ఇన్‌బాడీ సంస్థ తాజాగా నిర్వహించిన ఇండియా మజిల్ హెల్త్ సర్వేలో ఈ కఠోర వాస్తవాలు వెలుగు చూశాయి. కండరపుష్టిని అంచనా వేసేందుకు ఇన్‌బాడీ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలతోపాటు భారతీయుల్లో ఉన్న కండరాల సమస్య, పోషకాహార లోపాలు వెలుగుచూశాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ సర్వే చేపట్టారు. శారీరక శ్రమ ఉన్నవారు, లేనివారిని కలిపి మొత్తం 1,243 మందిని ఎంపిక చేసి, వారి శారీరక ఆరోగ్యాన్ని పరిశీలించారు. రిపోర్టులను విశ్లేషించి కండరాల బలహీనతలో ర్యాంకింగ్ ఇచ్చారు. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది.

లక్నో టాప్..

ఎనిమిది నగరాల్లో సగటున 71 శాతం మంది కండరాల బలహీనతతో బాధపడుతున్నారని సర్వే తేల్చింది. ఇందులో 30-50 ఏండ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. అత్యధిక శాతం మంది కండరాల బలహీనతతో బాధపడుతున్న నగరంగా లక్నో (77 శాతం), ఆ తర్వాత పాట్నా(77 శాతం) నిలిచాయి. హైదరాబాద్ 75 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. పురుషుల కన్నా మహిళలు కాస్త మెరుగ్గా ఉన్నారు. 78 శాతం మంది పురుషుల్లో కండరపుష్టి లోపిస్తే.. మహిళల్లో 72 శాతం మంది కండరాల బలహీనతతో బాధపడుతున్నారని సర్వే స్పష్టం చేసింది. ఇందుకు ప్రొటీన్ లోపమే ప్రధాన కారణమని గుర్తించింది. 75 శాతం పురుషులు, 74 శాతం మహిళల్లో ప్రొటీన్ లోపం వల్ల కండరాలు బలహీనంగా ఉన్నట్టు నిర్ధారించింది. కండరాల ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ, కండరపుష్టితో కలిగే లాభాలపై క్రీడాకారులు, జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు పెంచేవారికి తప్ప సాధారణ వ్యక్తుల్లో అవగాహన లోపిస్తున్నది.

రెండు పనులతో ఆరోగ్యం

కండరాలు బలంగా ఉంటే ఉత్సాహంగా ఉండటంతోపాటు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. కండరాల పరిమాణం, బలం పెంచుకోవడం కష్టమేమీ కాదు. అవసరమైనన్ని ప్రొటీన్లు ఆహారంలో తీసుకుంటే కండరాల పరిమాణం పెరుగుతుంది. పప్పులు, మాంసం, నూనెలు, నెయ్యి తీసుకుంటే ప్రొటీన్ లోపాన్ని అధిగమించవచ్చు. శారీరక శ్రమ, జిమ్‌లో కసరత్తులు, జాగింగ్, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, ఎరోబిక్స్ వంటి ఇతర వ్యాయామాలతో బలం పెరుగుతుంది.

1735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles