భర్త వేధిస్తున్నాడని భార్య ఫిర్యాదు

Sat,June 1, 2019 05:51 AM

husband suicide attempt after wife against complaint on his

పోలీసుల ఎదుటే భర్త ఆత్మహత్యాయత్నం..
దవాఖానకు తరలించిన పోలీసులు


మేడ్చల్ : భర్త వేధిస్తున్నాడని భార్య ఫిర్యాదు చేయగా, విచారణ నిమిత్తం భర్తను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. పోలీసుల ఎదుటే భర్త విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు అతన్ని ఘట్‌కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు డి.జ్యోతి బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బి.మోహన్‌రెడ్డిని 1984లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు ఉన్నది. వీరి వివాహానికి ముందే మోహన్‌రెడ్డికి పెద్దలు మరో మహిళతో వివాహం జరిపించారు.

దీంతో గత కొంత కాలంగా మొదటి భార్య నుంచి విడిపోయిన మోహన్‌రెడ్డి రెండో భార్య జ్యోతితో కలిసి ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని భర్త వేధిస్తుండడంతో మే 24న జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మోహన్‌రెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినా భర్త వేధింపులు తగ్గకపోవడంతో శుక్రవారం ఆమె మరోసారి పోలీసులను ఆశ్రయించింది. దీంతో మోహన్‌రెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఆరా తీస్తుండగా, అతడు వెంట తెచ్చుకున్న విషం సేవించాడు. పోలీసులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు గాంధీ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్‌కేసర్ సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపారు.

2375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles